శ్రీను వైట్లకు ఏ ఇబ్బంది లేదా అయితే..

శ్రీను వైట్లకు ఏ ఇబ్బంది లేదా అయితే..

ఏ దర్శకుడి మీద అయినా ఒక రొటీన్ ముద్ర పడి.. వరుసగా గట్టి ఎదురు దెబ్బలు తగిలితే.. తర్వాతి సినిమాకు మార్పు చూపించాలని.. కొత్తగా ఏదైనా ట్రై చేయాలని అనుకుంటాడు. కానీ శ్రీను వైట్ల మాత్రం అలాంటి మార్పేమీ చూపించలేకపోయాడు. ‘ఆగడు’ తర్వాత ‘బ్రూస్ లీ’.. దాని తర్వాత ‘మిస్టర్’.. ఇప్పుడేమో ‘అమర్ అక్బర్ ఆంటోని’.. ఇలా ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లే ఇస్తూ వచ్చాడు వైట్ల.

‘అమర్ అక్బర్ ఆంటోని’లో ఏదో కొంచెం వైవిధ్యం చూపిద్దామని ట్రై చేశాడు కానీ.. అదేమీ సరైన ఫలితాన్నివ్వలేదు. తొలి రోజే ఈ చిత్రం డిజాస్టర్ అని తేలిపోయింది. మామూలుగా ఇలా వరుస డిజాస్టర్లలో ఉన్నపుడు దర్శకులు కొంచెం భారీతనం తగ్గించుకుంటారు. తక్కువ బడ్జెట్లో.. కథా బలం ఉన్న సినిమాలు చేయాలని ప్రయత్నిస్తారు. అదనపు హంగులు తగ్గించుకుంటారు.

కానీ వైట్ల మాత్రం అలా రాజీ పడలేదు. తన మార్కెట్.. హీరో మార్కెట్ చూసుకోకుండా ఇష్టానుసారం ఖర్చు పెట్టిస్తూ వచ్చాడు. అందుకే గత ఏడాది ‘మిస్టర్’ నిర్మాతలు దారుణంగా దెబ్బ తిన్నారు. ఇప్పుడు ‘మైత్రీ మూవీ మేకర్స్’ వంతు వచ్చింది. ‘అమర్ అక్బర్ ఆంటోని’కి ముందు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ కూడా వైట్ల మాటల గొప్పలేమీ తగ్గించలేదు. ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఐదుగురు నిర్మాతలు ముందుకొచ్చారని.. తానే మైత్రీ వాళ్లయితే సరిగ్గా చేస్తారని వాళ్లకు అవకాశమిచ్చానని గొప్పలు పోయాడు.

తాను ఫ్లాపుల్లో ఉన్నపుడు కూడా నిర్మాతల సమస్య అయితే లేదన్నాడు. మరి ‘అమర్ అక్బర్ ఆంటోని’ డిజాస్టర్ అయిన నేపథ్యంలో ఇప్పుడు కూడా వైట్లకు నిర్మాతల సమస్య లేనట్లేనా? ‘అమర్ అక్బర్ ఆంటోని’ కోసం పోటీ పడ్డ నిర్మాతల్లో ఒకరికి వైట్ల ఛాన్స్ ఇస్తాడా? అన్నది చూడాలి. అలాగే తాను ఎలాంటి స్థితిలో కూడా ఏ హీరోనూ.. నిర్మాతనూ సినిమా చేయమని అడగనని కూడా వైట్ల చెప్పాడు. మరి ఇప్పుడు కూడా వైట్ల అలాగే ఉంటాడా.. ఎవరైనా అడిగే వరకు సినిమా చేయడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English