ఎన్టీఆర్ ముద్దుల మ‌న‌వ‌రాలు..

ఎన్టీఆర్ ముద్దుల మ‌న‌వ‌రాలు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి - టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు కూక‌ట్‌పల్లిలో త‌మ పార్టీ అభ్య‌ర్థిగా నంద‌మూరి సుహాసినిని నిల‌ప‌డంలో త‌న‌దైన మార్కు చూపించారు. ఆయ‌న ఎంపికపై ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చ‌ర్చ జ‌రుగుతోంది. సుహాసినికి టికెట్ ఇవ్వ‌డం ద్వారా.. ఎన్టీఆర్ ర‌థ‌సార‌థిగా పేరుగాంచిన ఆయ‌న ప్రియ పుత్రుడు హ‌రికృష్ణ‌కు చంద్ర‌బాబు త‌గిన నివాళి అర్పించార‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

హ‌రికృష్ణ మ‌ర‌ణంతో ప్ర‌జ‌ల్లో ఉన్న సానుభూతిని సొమ్ము చేసుకునేందుకే సుహాసినికి చంద్ర‌బాబు టికెట్ ఇచ్చార‌ని గిట్ట‌నివాళ్లు, ప్ర‌త్య‌ర్థులు ప్ర‌స్తుతం ప్ర‌చారం చేస్తున్నారు. ఆ ప్ర‌చార‌మంతా గాలివాట‌మేనన్న‌ది విశ్లేష‌కుల వాద‌న‌. సుహాసినికి టికెట్ కేటాయించ‌డం వెనుక చాలా కార‌ణాలే ఉన్నాయ‌ని వారు చెబుతున్నారు. సుహాసిని ఎన్టీఆర్‌కు ముద్దుల మ‌న‌వ‌రాలు. ఆమెపై ఎన్టీఆర్ ప్ర‌త్యేక అభిమానం చూపేవారు. తాజాగా సుహాసిని త‌న తాత‌తో క‌లిసి ఉన్న ఓ ఫొటోను ట్విట‌ర్‌లో షేర్ చేశారు. అది ఆ తాతా మ‌న‌వ‌రాళ్ల మ‌ధ్య ప్రేమ‌కు ఓ మ‌చ్చు త‌న‌క‌.

ఎన్టీఆర్ కుమారులు హ‌రికృష్ణ‌, బాల‌య్య‌ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఇద్ద‌రూ త‌మ తండ్రి స్థాపించిన టీడీపీలోనే ఉన్నారు. ఎన్టీఆర్ ఒక్క‌గానొక్క కుమార్తె పురంధేశ్వ‌రి మాత్రం తొలుత కాంగ్రెస్‌లో ఉండి.. ఆపై బీజేపీలోకి మారారు. కాబ‌ట్టి ఎన్టీఆర్ ఇంటి నుంచి ఆడ‌ప‌డ‌చు టీడీపీలో లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. సుహాసినిని ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి తీసుకురావ‌డం ద్వారా ఆ లోటును చంద్ర‌బాబు భ‌ర్తీ చేసిన‌ట్ల‌యింది.

ఎన్టీఆర్ ప్రియ కుమారుడు హ‌రికృష్ణ కుటుంబానికి న్యాయం చేయ‌డం కూడా సుహాసినికి టికెట్ ఇవ్వ‌డం వెనుక ఓ బ‌ల‌మైన కార‌ణం. ఎన్టీఆర్ మ‌ర‌ణం త‌ర్వాత హ‌రికృష్ణ టీడీపీకి ఎన‌లేని సేవ‌లందించారు. కొన్ని సంద‌ర్భాల్లో బావ చంద్ర‌బాబుతో ఆయ‌న‌కు పొర‌పచ్చాలు వ‌చ్చాయ‌న్న మాట నిజ‌మే కానీ అవేమీ స‌ర్దుకోలేనంత తీవ్ర‌మైన‌వి కావు. హ‌రికృష్ణ మ‌ర‌ణంతో టీడీపీలో కొంత శూన్యం ఏర్ప‌డింది. ఆ శూన్యాన్ని భ‌ర్తీ చేయ‌గ‌ల సామ‌ర్థ్యం ఆయ‌న కుమారులు - క‌థానాయ‌కులు క‌ల్యాణ్‌రామ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ల‌లో ఉంది. కానీ, వారిద్ద‌రూ ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగా ఉన్నారు. అప్పుడ‌ప్పుడు ప్ర‌చార బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించినా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వారు పూర్తిగా రావాలంటే చాలా ఏళ్ల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశ‌ముంది. ఈ నేప‌థ్యంలోనే హ‌రికృష్ణ కుటుంబానికి టీడీపీలో స‌ముచిత ప్రాధాన్యం ల‌భించేందుకు వీలుగా సుహాసిని చంద్ర‌బాబు రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చార‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English