కాక రేపుతున్న కాకా కొడుకు!

కాక రేపుతున్న కాకా కొడుకు!

ఎన్నిక‌ల్లో పోటీ చేసే విష‌యంపై మాజీ మంత్రి - టీఆర్ఎస్ నేత గ‌డ్డం వినోద్ ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌ట్లేదు. స్వ‌యంగా కేసీఆర్ బుజ్జ‌గించినా, ఎమ్మెల్సీ సీటు ఇస్తామ‌ని హామీ ఇచ్చినా ఆయ‌న దిగిరావ‌ట్లేదు. తాను బ‌రిలో దిగ‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

తెలంగాణ ప్ర‌జ‌లంతా ముద్దుగా కాకా అని పిలుచుకునే ద‌ళిత దిగ్గ‌జం గ‌డ్డం వెంక‌ట‌స్వామి కొడుకు వినోద్‌. ఆయ‌న సోద‌రుడు మాజీ ఎంపీ వివేక్‌. అన్న‌ద‌మ్ములిద్ద‌రూ గ‌తంలో కాంగ్రెస్‌లో ఉండేవారు. మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇద్ద‌రూ టీఆర్ఎస్‌లో చేరారు.

ఈ ద‌ఫా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ త‌ర‌ఫున చెన్నూరు నుంచి లేదా బెల్లంప‌ల్లి నుంచి పోటీ చేయాల‌ని వినోద్ భావించారు. అయితే, కేసీఆర్ ఆయ‌న‌కు మొండి చేయి చూపించారు. చెన్నూరు టికెట్‌ను ఎంపీ బాల్క సుమాన్‌కు ఇచ్చిన గులాబీ ద‌ళ‌ప‌తి.. బెల్లంప‌ల్లి టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌కు కేటాయించారు.

త‌న‌కు టికెట్ రాక‌పోవ‌డంతో ఆగ్ర‌హించిన వినోద్‌.. కాంగ్రెస్‌లో చేరేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు. టికెట్‌పై హామీ ద‌క్కేలా దిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానం పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. అంత‌లో స్వ‌యంగా కేసీఆర్ నుంచి ఫోన్ రావ‌డంతో దిల్లీ నుంచి వినోద్ వెన‌క్కి వ‌చ్చారు. ఆ త‌ర్వాత వినోద్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఎన్నిక‌ల అనంత‌రం ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తామ‌ని కేసీఆర్ మాట‌గా హామీ ఇచ్చారు. దీంతో వినోద్ కాస్త వెన‌క్కి త‌గ్గిన‌ట్లే క‌నిపించింది.

మ‌ళ్లీ ఏమైందో ఏమో తెలియ‌దు కానీ ఇప్పుడు వినోద్ మ‌ళ్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వాస్త‌వానికి తెలంగాణ జ‌న స‌మితిలో చేరి పోటీ చేయాల‌ని కూడా ఆయ‌న గ‌తంలో ప్ర‌య‌త్నించారు. ఆ ప్ర‌య‌త్నాలు కూడా బెడిసి కొట్టాయి. తాజాగా మ‌హా కూట‌మి పొత్తుల్లో భాగంగా బెల్లంప‌ల్లి సీటును సీపీఐ ద‌క్కించుకుంది. దీంతో సీపీఐలో చేరి అక్క‌ణ్నుంచి పోటీ చేయాల‌ని వినోద్ భావిస్తున్నట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

అయితే - సీపీఐ ఇప్ప‌టికే బెల్లంప‌ల్లిలో త‌మ అభ్య‌ర్థిగా మ‌ల్లేష్‌ను ప్ర‌క‌టించింది. ఈ ప‌రిస్థితుల్లో మ‌ల్లేష్‌ను వినోద్ బుజ్జ‌గించ‌గ‌ల‌రా? ఆ టికెట్ ద‌క్క‌క‌పోతే స్వ‌తంత్ర అభ్య‌ర్థిగానైనా పోటీ చేసి తీరుతారా? అనే అంశాలు ప్ర‌స్తుతం బెల్లంప‌ల్లితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English