కవిత కల్లకుంట్లా కాదు.. సుహాసిని నందమూరీ కాదు

కవిత కల్లకుంట్లా కాదు.. సుహాసిని నందమూరీ కాదు

దేశంలో ఎన్నో రాజకీయ వంశాలు పాపులర్ కాగా తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరైన తెలుగు రాష్ట్రాల్లో నందమూరి వంశం ఇప్పటికే రాజకీయంగా పాతుకుపోగా... తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం కూడా రాజకీయంగా పాగా వేసింది.

సినీ నటుడిగా అశేషాభిమానం సంపాదించుకున్న నందమూరి తారకరామారావు అలియాస్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ స్థాపించిన తరువాత తాను ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లోనే అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేయగా ఆయన అల్లుళ్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబునాయుడులు అప్పట్లో ఆయన మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేశారు. అనంతర కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రయ్యారు. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ మంత్రిగా, ఎంపీగా పనిచేశారు. మరో తనయుడు బాలకృష్ణ కూడా ఎమ్మెల్యే. ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి(దగ్గుబాటి) కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్రమంత్రిగా పనిశారు. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎన్టీఆర్ మనవడు, చంద్రబాబు తనయుడు అయిన నారా లోకేశ్ మంత్రిగా పనిచేస్తున్నారు.

ఇప్పుడు అదే కుటుంబం నుంచి సుహాసిని కూకట్ పల్లి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తున్నారు. ఆమె నందమూరి హరికృష్ణ కుమార్తె. అయితే... ఆమె నందమూరి ఇంటి ఆడపడుచు అయినప్పటికీ మాజీ ఎంపీ శ్రీహరి కోడలు కావడంతో ఇప్పుడామె ఇంటి పేరు చుండ్రు. ఇంటి పేరు వేరయినప్పటికీ నందమూరి కుటుంబ వారసురాలిగానే ఆమె ఎన్నికల క్షేత్రంలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

మరోవైపు తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబమూ అంతే.. కవితకు 2003లో దేవనపల్లి అనిల్ కుమార్‌తో వివాహమైంది. అయితే, రాజకీయంగా ఆమె కల్వకుంట్ల ఇంటిపేరుతోనే చెలామణీ అవుతున్నారు. కేసీఆర్ కుమార్తెగా, ఎంపీగా రాజకీయంగా ఎదుగుతున్న ఆమెను కేంద్ర మంత్రిని చేసేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయి.

ఇదే తీరుగా ఇప్పుడు కూకట్ పల్లి బరిలో టీడీపీ నుంచి దిగుతున్న చుండ్రు సుహాసిని కూడా మెట్టినింటి పేరుతో కాకుండా పుట్టింటి పేరు నందమూరినే ప్రొజెక్ట్ చేస్తూ ప్రజల ముందుకు వెళ్తున్నారు.

మొత్తానికి తెలుగు రాజకీయాల్లో ఇంటిపేర్లనేవి ఓట్ల పంట పండించే సాధనాలుగా మారడంతో ఆ ఇంటి ఆడబిడ్డలు రాజకీయ ఎదుగుదల కోసం పుట్టింటి ఇంటి పేరును వాడుకునేందుకే ఆసక్తి చూపుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English