కూటమిలో ఫ‌స్ట్ వికెట్‌...ఇంటిపార్టీ గుడ్‌బై

కూటమిలో ఫ‌స్ట్ వికెట్‌...ఇంటిపార్టీ గుడ్‌బై

కాంగ్రెస్ పార్టీకి ఊహించ‌ని షాక్ త‌గ‌లింది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లతో ఏర్ప‌డిన మహాకూటమిలో తొలివికెట్ ప‌డింది. ప్ర‌ధాన పార్టీలైన సీపీఐ, టీజేఎస్‌ ఓ వైపు త‌మ‌కు కేటాయించిన టికెట్ల‌పై కాంగ్రెస్ నేత‌ల తీరుపై భ‌గ్గుమంటుండ‌గా మ‌రోవైపు సొంత పార్టీ నేత‌ల్లోనే అసంతృప్తి భ‌గ్గుమంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఇలా హాట్ హాట్ ప‌రిణామాలు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే, మ‌హాకూట‌మిలో మిత్ర‌ప‌క్ష‌మైన తెలంగాణ ఇంటి పార్టీ కాంగ్రెస్‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చింది. కూట‌మిలోని మిగ‌తా నాలుగు పార్టీల‌కు సీట్లు కేటాయించినప్పటికీ ఇంటి పార్టీకి మాత్రం కోరుకున్న ఒక్క సీటును కూడా ఇవ్వలేకపోవ‌డాన్ని నిర‌సిస్తూ...త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. 21మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ బుధవారం విడుదల చేశారు.  రెండో జాబితాను కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. త‌ద్వారా కూట‌మి మిత్ర‌ధ‌ర్మానికి గుడ్‌బై చెప్పింది.

కాంగ్రెస్ సార‌థ్యంలోని కూట‌మిలో చేరిన ఇంటిపార్టీ సీట్ల పంప‌కంపై ఆశ‌లు పెట్టుకుంది. అయితే ప్ర‌తిపాదించిన స్థాయిలో టికెట్లు ఇవ్వ‌క‌పోగా ఆఖ‌రికి ఒక‌ట్రెండు సీట్ల‌లో కూడా షాకిచ్చింది. తెలంగాణ ఇంటి పార్టీకి నకిరేకల్ సీటు ఇవ్వాలని మొదట కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినప్పటికీ.. కోమటిరెడ్డి బ్రదర్స్ చేసిన లాబీయింగ్ వల్ల వారి అనుచరుడు చిరుమర్తి లింగయ్యకు నకిరేకల్ స్థానాన్ని కేటాయించారు. లింగయ్యకు నకిరేకల్ ఇస్తే మహబూబ్‌నగర్ స్థానాన్ని కేటాయించాలని ఇంటి పార్టీ నేతలు కోరారు. ఆ స్థానం టీడీపీ అభ్యర్థి ఎర్ర శేఖర్‌కు కేటాయించడంతో.. ఇంటి పార్టీ దిక్కు తోచని స్థితికి చేరింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్  కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త‌మ పార్టీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న కాంగ్రెస్ తీరుపై భ‌గ్గుమ‌న్నారు.

మహాకూటమిలో టీడీపీ ఆధిపత్యం, పార్టీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల అనేక మంది సీనియర్‌ నాయకులకు అన్యాయం జరుగుతోందని చెరుకుసుధాక‌ర్ మండిప‌డ్డారు.  తెలంగాణ ఇంటి పార్టీకి ఒక సీటు కేటాయిస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్‌ పెద్దలు మాట తప్పారని విమర్శించారు. భట్టి విక్రమార్క తమను మహాకూటమిలోకి ఆహ్వానించారని అయితే,సీట్లు ఇవ్వకుండా అవమానించారని అన్నారు. తమను ఢిల్లీకి పిలిచి అవమానించారే తప్ప పట్టించుకున్న వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.  సీటు ఇస్తానని ఢిల్లీ పిలిపించుకొని అవమానించారని మండిపడ్డారు. తమ పార్టీకి ఒక సీటు కేటాయిస్తానన్న కుంతియా.. మొహం చాటేశారని మండిప‌డ్డారు. అందుకే బుధ‌వారం హైదరాబాద్‌లో అమరవీరుల స్తూపం వద్ద దీక్షకు దిగామ‌న్నారు. తెలంగాణ ఇంటిపార్టీ తరపున మొత్తం 52 మందిని బరిలోకి దింపుతామని వెల్లడించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English