పొన్నాల కోసం కోదండరాం త్యాగం

పొన్నాల కోసం కోదండరాం త్యాగం

మహాకూటమిలో సర్దుకుపోవడానికి తెలంగాణ జన సమితి నేత కోదండరాం త్యాగమూర్తి అవతారం ఎత్తినట్లు తెలుస్తోంది. టీఆరెస్‌ను ఓడించాలంటే టీజేఎస్ సొంతంగా పోటీ చేయకుండా తమతో కలిసిరావడమే ఉత్తమం అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గీసిన గీతను దాటలేకపోతున్న కోదండరాం ఇప్పుడు ఏకంగా తాను పోటీ చేయాలనుకుంటున్న స్థానాన్నే కాంగ్రెస్ కోసం.. ఆ పార్టీ నేత పొన్నాల లక్ష్మయ్య కోసం త్యాగం చేస్తున్నట్లు చెబుతున్నారు.

కూటమిలో చేర్చుకుని బయటకు వెళ్లకుండా ఎక్కడికక్కడ తనను మెత్తబెడుతుండడంతో అంటిపెట్టుకుని ఉన్న కోదండరాం చివరకు తాను సైతం త్యాగం చేయడానికి వెనుకాడడం లేదు. కూటమి నుంచి వైదొలిగితే తెలంగాణలో రాచరిక, కుటుంబ పాలన అంతం చేయలేమన్న ఉద్దేశంతో కోదండరాం కూటమికి కట్టుబడి ఉన్నారని టీజేఎస్ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో కోదండరాం పోటీ చేస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతున్న జనగామ సీటును ఆయన బీసీ నేత పొన్నాలకు విడిచిపెట్టడానికి సిద్ధమయ్యారట.

పొన్నాల బిసి మున్నూరు కాపు కులానికి చెందిన వ్యక్తి. ఆయన కాంగ్రెస్ లో సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆ స్థానం కోదండరాం కోరారు. కానీ, పొన్నాల కూడా పట్టు విడవలేదు. ఈలోగా కాంగ్రెస్ ఎంతో ఆలస్యం చేసిచేసి మొత్తానికి 65 మందితో తొలి జాబితా విడుదల చేసింది. అందులో జనగామకు అభ్యర్థి ప్రకటించలేదు. దీంతో ఆ స్థానం కోదండరాంకు ఇవ్వడానికేనని అర్థం చేసుకున్న పొన్నాల వెంటనే అధిష్ఠానాన్నికలిసేందుకు దిల్లీ విమానం ఎక్కేశారు. అక్కడాయన బీసీ కార్డు వేశారు. కూటమిలో బీసీ సీట్లకు కోత పెట్టారని.. మొదటి జాబితాలో రెడ్లకే ప్రాధాన్యమిచ్చారని.. ఇప్పుడు బీసీలకు నిలయమైన నియోజకవర్గంలో స్థానికేతరుడైన అగ్రకుల నేత కోదండరాంను ఎలా తెస్తారని అధిష్ఠానం వద్ద ఆయన గట్టిగానే వాదించినట్లు తెలుస్తోంది.

దీంతో బీసీ సీటులో బీసీ నేతను పక్కకు నెట్టి తాను పోటీ చేయడం భావ్యం కాదని కోదండరాం త్యాగానికి సిద్ధమైనట్లు తాజా సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English