కేసీఆర్‌పై పోటీ చేస్తున్నా..

కేసీఆర్‌పై పోటీ చేస్తున్నా..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేయనున్నట్లు ప్రజాగాయకుడు గద్దర్ ప్రకటించారు. మెదక్ జిల్లా గజ్వేల్ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. గురువారం ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని చెప్పారు.

సోనియా, రాహుల్ గాంధీలను కలసినప్పుడు 45 నిమిషాల పాటు పాటలు పాడి వినిపించానన్నారు. ‘సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమొక్రసీ’ పుస్తకం గురించి రాహుల్ కు వివరించానని గద్దర్ చెప్పారు. ఢిల్లీలో సీఐడీ అడిషనల్ డీజీని కలిశానని.. తనకు భద్రత కల్పించాలని కోరానని గద్దర్ తెలిపారు. ఇదే విషయమై చీఫ్ ఎలక్షన్ అధికారితో కూడా మాట్లాడానని చెప్పారు.

తన ప్రచారంలో భాగంగా… తొలి దశలో ఎస్టీ, రెండో దశలో ఎస్సీ, మూడో దశలో బీసీ, నాలుగో దశలో పేద ఓటర్ల వద్దకు వెళ్లి… వారిలో ఓటుపై చైతన్యం కల్పిస్తానని అన్నారు. జర్నలిస్టులే తన సైన్యమని గద్దర్ అన్నారు. సాధారణ అవినీతి కంటే రాజకీయ అవినీతి అత్యంత ప్రమాదకరమైనదని ఆయన తెలిపారు. తనపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో కూడా తనకు తెలియదని చెప్పారు. శాంతి చర్చల కోసం ఎందరినో కలిశానని…ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరినైనా కలిసే అవకాశం ఉంటుందని అన్నారు.

భావప్రకటన స్వేచ్ఛ లేనప్పుడు ఈ రాజ్యాంగం, ఈ ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు.  ఈ నెల 15 నుంచి తెలంగాణలోని పల్లె పల్లెకు వెళతానన్నారు.  ఆదిలాబాద్ నుంచి తన ప్రచారం ప్రారంభిస్తానని గద్దర్ తెలిపారు. అయితే... ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తూ కేసీఆర్‌తోనే తలపడడానికి గద్దర్ సిద్ధమవుతున్నారంటే అదేదో ఆషామాషీ వ్యవహారం కాదని.. ఆయన కచ్చితంగా బలమైన మద్దతు పొందాకే రంగంలోకి దిగుతున్నారని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English