టీఆర్ఎస్‌కు షాక్‌: కారు దిగిన కీల‌క నేత

టీఆర్ఎస్‌కు షాక్‌: కారు దిగిన కీల‌క నేత

స్వ‌ప‌క్ష‌ నేత‌ల మధ్య కుమ్ములాట‌ల‌తో టీఆర్ఎస్‌కు త‌ల‌నొప్పిగా మారిన స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఆ పార్టీకి మ‌రో భారీ షాక్ త‌గిలింది. త‌న‌కు టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంపై తీవ్ర అస‌మ్మ‌తితో ఉన్న కీల‌క నేత రాజార‌పు ప్ర‌తామ్ గులాబీ ద‌ళానికి రాజీనామా చేశారు. మ‌రో పార్టీ నుంచి తాను ఎన్నిక‌ల బ‌రిలో ఉండ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

జ‌న‌గామ జిల్లా స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం ముందు నుంచీ రాష్ట్ర ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే - మాజీ ఉప ముఖ్య‌మంత్రి తాటికొండ రాజయ్య‌కు టీఆర్ఎస్ టికెట్ ఖ‌రారు చేసింది.

దీంతో ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి వ‌ర్గం తీవ్ర అసంతృప్తికి లోనైంది. శ్రీ‌హ‌రికే టికెట్ కేటాయించాలంటూ ఆయ‌న మ‌ద్ద‌తుదారులు ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. స్వ‌యంగా శ్రీ‌హ‌రి కూడా కేసీఆర్‌, కేటీఆర్‌ల‌ను క‌లిసి.. త‌న‌కు టికెట్ ఇవ్వాల‌ని కోరారు. అయితే - ఒక్క చోట అభ్య‌ర్థిని మార్చినా మిగ‌తా చోట్ల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర‌వుతుందంటూ గులాబీ అధినాయ‌క‌త్వం ఎలాగోలా శ్రీ‌హ‌రికి న‌చ్చ‌జెప్పింది. రాజ‌య్య త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌డానికి ఆయ‌న్ను ఒప్పించింది.

ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో రాజార‌పు ప్ర‌తాప్ కూడా టీఆర్ఎస్‌కు కీల‌క నేత‌గా ఉన్నారు. క్షేత్ర‌స్థాయిలో ఆయ‌న‌కు మంచి ప‌ట్టు ఉంది. శ్రీ‌హ‌రి, రాజ‌య్య మ‌ధ్య టికెట్ గొడ‌వ జ‌రుగుతున్న‌ప్పుడు కూడా ఆయ‌న ఆవేశానికి లోను కాలేదు. క్షేత్ర స్థాయిలో ప‌రిస్థితులు త‌న‌కు అనుకూలంగా ఉన్నాయని, వాటిని గ‌మ‌నించి పార్టీ తిరిగి త‌న‌కు టికెట్ ఇస్తుంద‌ని విశ్వ‌సించారు. నియోజ‌క‌వ‌ర్గంలో త‌న ప్ర‌చార ప‌ర్వాన్ని కొన‌సాగించారు.

గులాబీ ద‌ళ‌ప‌తి నుంచి ఇప్ప‌టికీ ఏమాత్రం హామీ ల‌భించ‌క‌పోవ‌డంతో తీవ్ర నిరాశ‌కు గురైన ప్ర‌తాప్‌.. ఇక కారు దిగిపోవ‌డ‌మే మంచిద‌ని నిర్ణ‌యించుకున్నారు. తాజాగా త‌న అనుచ‌రులు, మ‌ద్ద‌తుదారుల‌తో స‌మావేశ‌మైన ఆయ‌న‌.. టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు. బీఎస్పీ త‌ర‌ఫున ఎన్నిక‌ల బ‌రిలో దిగాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. భారీగా అనుచ‌ర‌గ‌ణ‌మున్న ప్ర‌తాప్ వంటి కీల‌క నేత పార్టీని వీడటం స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో కారు పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బే!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English