ఓవైసీకు ఆమే సరైన పోటీ

ఓవైసీకు  ఆమే సరైన పోటీ

మీకు ద‌మ్ముంటే హైద‌రాబాద్ ఎంపీగా పోటీ చేయ్‌.. నా మీద గెలువు.. ఇది ప్ర‌ధాని మోడీతో మొద‌లు బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వానికి మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ విసిరే స‌వాల్‌. ఎంత మ‌జ్లిస్ అధినేత అయితే మాత్రం అయితే హైద‌రాబాద్ లేదంటే.. మైనార్టీలు అధికంగా ఉన్న కొన్ని చోట్ల త‌ప్పించి ఆయ‌న త‌న స‌త్తా చాటింది లేదు. కంచుకోట లాంటి హైద‌రాబాద్ ఎంపీ స్థానం నుంచి నాన్ స్టాప్ గా గెలుస్తున్న అస‌ద్‌కు.. ఆ ప్రాంత ఓట‌ర్లు ఇచ్చిన ఆత్మ‌విశ్వాసంతో ఎవ‌రినైనా త‌న ఇలాకాలో పోటీకి దిగే ద‌మ్ముందా? అంటూ ప్ర‌శ్నిస్తుంటారు.

ఇప్ప‌టివ‌ర‌కూ అస‌ద్ స‌వాల్‌కు స‌మాధానం ఇచ్చిన పార్టీ కానీ.. నేత కానీ లేదు. ఎందుకంటే.. ఆయ‌న్ను హైద‌రాబాద్ ఎంపీ స్థానం నుంచి ఢీ కొట్ట‌టం అంటే సామాన్య‌మైన విష‌యం కాదు. ఈ విష‌యాన్ని గుర్తించిన ప్రాంతీయ పార్టీలు మొద‌లుకొని జాతీయ పార్టీలు సైతం ఇప్ప‌టివ‌ర‌కూ పాత‌బ‌స్తీని.. హైద‌రాబాద్ ఎంపీ స్థానాన్ని లెక్క‌లోకి వేసుకోకుండా ప్లాన్ చేసుకునే ప‌రిస్థితి. ఇందుకు టీఆర్ఎస్ సైతం మిన‌హాయింపు కాదు.

ఈ ప‌రిస్థితిని బ‌ద్ధ‌లు కొట్టాల‌న్న ఆలోచ‌న‌ను ఆ మ‌ధ్య‌న సీపీఎం చేసింది. కొన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. కామ్రేడ్స్ కు మ‌జ్లిస్ ఒక ప‌ట్టాన అర్థం కాలేదు. ఎప్పుడూ లేని విధంగా మ‌జ్లిస్ కోట‌లో పాగా వేయాల‌ని ప్ర‌య‌త్నించిన క‌మ్యూనిస్టులు సాధ్యం కాద‌ని చేతులెత్తేసి పాత‌బ‌స్తీ నుంచి త‌ప్పుకున్నారు. ఆ పార్టీ త‌ర్వాత అంత‌టి సాహ‌సాన్ని ఎవ‌రూ చేసింది లేదు. ఇన్నాళ్ల త‌ర్వాత మ‌ళ్లీ బీజేపీ ఓవైసీ సోద‌రుల ఇలాకా మీద దృష్టి సారించింది.

అనేక త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు.. ప్లానింగ్ త‌ర్వాత అగ్గి బ‌రాఠా లాంటి ముస్లిం మ‌హిళ‌ను అక్బ‌రుద్దీన్ పైన బ‌రిలోకి దింపారు క‌మ‌ల‌నాథులు. అస‌దుద్దీన్ ఓవైసీ స‌వాలుకు ఆయ‌న సోద‌రుడు అక్బ‌రుద్దీన్ ఓవైసీ ఇలాకాను ట‌చ్ చేసే సాహ‌సం చేసింది బీజేపీ.  అస‌ద్‌కు హైద‌రాబాద్ లోక్ స‌భ స్థానం ఎలానో.. అక్బ‌రుద్దీన్ కి చాంద్రాయణ‌గుట్ట నియోజ‌క‌వ‌ర్గం అలాంటిది. అయితే.. ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న‌కు స‌రైన ప్ర‌త్య‌ర్థి బ‌రిలోకి దిగ‌లేదు. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా బీజేపీ పావులు క‌దిపింది.

అక్బ‌రుద్దీన్ పై పోటీకి బీజేపీకి చెందిన మైనార్టీ మ‌హిళ‌.. ఉన్న‌త విద్యావంతురాలైన స‌య్య‌ద్ ష‌హ‌జాదీని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఓవైసీ కుటుంబానికి పాత‌బ‌స్తీ మీద ఉన్న గుత్తాధిప‌త్యాన్ని బ‌ద్ద‌లు కొట్టాల‌న్న ప్ర‌య‌త్నం ఒక ప‌క్క కాంగ్రెస్ షురూ చేస్తే.. బీజేపీ సైతం ఇదే రీతిలో పావులు క‌దిపింది. ఇంత‌కీ ష‌హ‌జాదీ ఎవ‌రు?  ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్న‌ది చూస్తే.. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌య పోస్టుగ్రాడ్యుయేట్ తో పాటు.. ఓవైసీ కుటుంబంపై ఘాటు వ్యాఖ్య‌ల‌తో దిట్ట ఆమె. అంతేనా.. ఏబీవీపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యురాలైన ఆమెను బ‌రిలోకి దించ‌టం ద్వారా అక్బ‌రుద్దీన్‌కు క‌మ‌ల‌నాథులు గ‌ట్టి స‌వాలునే విసిరారు.

ముస్లిం మ‌హిళ అయిన‌ప్ప‌టికీ ఏబీవీపీ.. వీహెచ్ పీ.. బీజేపీకి చెందిన కార్య‌క‌ర్త‌ల‌తో క‌లివిడిగా తిర‌గ‌టంతో పాటు.. వారితో మంచి సంబంధాలు నెర‌ప‌టం ఆమెకు అల‌వాటే. అంతేనా.. హిందువుల ప‌ర్వ‌దినాల సంద‌ర్భంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల్లో జోరుగా పాల్గొనే ఆమె.. అక్బరుద్దీన్ తీరును క‌డిగి పారేస్తున్నారు. నాలుగు ద‌ఫాలుగా ఎమ్మెల్యేవిగా వ్య‌వ‌హ‌రించిన నువ్వు.. నియోజ‌క‌వ‌ర్గానికి చేసిందేమిటి? అంటూ సూటిగా అడుగుతూ క‌డిగిపారేస్తోంది.

అంతేనా.. పాత‌బ‌స్తీ ముస్లింల జీవితాల్లో కించిత్ మార్పు తీసుకొచ్చావా?  పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించావా?  అస‌లు నీ హ‌యాంలో పాత‌బ‌స్తీలో ఎంత‌మంది ఇంజ‌నీర్లు అయ్యారు.. ఎంత‌మంది డాక్ట‌ర్లు అయ్యారంటూ ప్ర‌శ్నించ‌టం ద్వారా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. బీజేపీ స‌మ‌ర్థిస్తోన్న ట్రిపుల్ త‌లాక్ పై పార్టీ విధానాల్ని బ‌లంగా త‌న అభిప్రాయాన్ని వినిపించే ఆమె.. బీజేపీని హిందూ పార్టీగా ముద్ర వేయ‌టాన్ని త‌ప్పు ప‌డ‌తారు. అస‌లు సిస‌లైన ప్ర‌జాస్వామ్య‌.. లౌకిక పార్టీ బీజేపీ అని చెప్పే ఆమె ఎంట్రీతో అక్బ‌రుద్దీన్ కు ఇప్పుడు మ‌హా ఇబ్బందిగా మారిన‌ట్లు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఇన్నాళ్ల త‌ర్వాత తొలిసారి అక్బరుద్దీన్ కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంటున్న‌ట్లుగా చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English