కేసీఆర్‌ను ఓడించ‌మ‌ని, న‌న్ను హరీష్ అడిగారు

కేసీఆర్‌ను ఓడించ‌మ‌ని, న‌న్ను హరీష్ అడిగారు

గ‌జ్వేల్ ... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీచేస్తున్న నియోజ‌క‌వ‌ర్గం. నిజానికి ఎక్క‌డ ముఖ్య‌మంత్రులు పోటీ చేసినా ఆ నియోజ‌క‌వ‌ర్గంపై పెద్ద‌గా వార్త‌లు రావు. ఎందుకంటే సీఎంలు పోటీ చేసి సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఓడిపోవ‌డం త‌క్కువే. పైగా కేసీఆర్ వంటి నేత‌లు ఓడిపోవ‌డం చాలా అరుదు. అందుకే అలాంటి నియోజ‌క‌వ‌ర్గాలు పెద్ద‌గా ఎన్నిక‌ల స‌మ‌యంలో వార్త‌ల్లో ఉండ‌వు. కానీ విచిత్రంగా కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గం త‌ర‌చుగా వార్త‌ల్లో ఉంటోంది. దీనికి అనేక కార‌ణాలున్నాయి.

ప్ర‌జా యుద్ధ నౌక‌గా ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ ఉన్న ప్ర‌జాగాయ‌కుడు గ‌ద్ద‌ర్ రాహుల్ ను క‌లిశారు. తాను గ‌జ్వేల్ నుంచి పోటీ చేద్దామ‌నుకుంటున్నాను. స‌హ‌క‌రించండి అని కోరారు. దానికి రాహుల్ నుంచి హామీ రాక‌పోయినా వ్య‌తిరేక‌త అయితే రాలేదు.

మ‌రోవైపు గ‌త ఎన్నిక‌ల్లో చాలా స్వ‌ల్ప మెజారిటీతో కేసీఆర్ అపుడు తెలుగుదేశం అభ్య‌ర్థిగా ఉన్న ఒంటేరు ప్ర‌తాప్‌రెడ్డి పై గెలిచారు. ఈసారి ఆయ‌న కాంగ్రెస్‌లో ఉన్నారు. చిత్ర‌మేంటంటే... ఇపుడు కాంగ్రెస్‌-టీడీపీ క‌లిసి పోటీ చేస్తున్నాయి. కేసీఆర్ మీద మ‌ళ్లీ ఒంట‌రే ప్ర‌తాప‌రెడ్డి పోటీచేస్తున్నారు. అంటే ఇపుడు రెండు పార్టీల బ‌లం ఉంది ప్ర‌తాప్‌రెడ్డికి. గ‌త ఎన్నిక‌ల్లో ఆ రెండు పార్టీల ఓట్లు క‌లిపితే కేసీఆర్ కు వ‌చ్చిన ఓట్ల కంటే 30 వేల ఓట్లు ఎక్కువ‌. దీంతో ఇప్ప‌టికే  కేసీఆర్ మైండ్ బ్లాక్ అయ్యింది. అందుకే ఎందుక‌యినా మంచిద‌ని మ‌రో నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నాడు. అయితే, ప్ర‌చారంలో భారీగా దూసుకుపోతున్న ఒంటేరు ప్ర‌తాప్‌రెడ్డి హ‌రీష్ రావుపై భారీ ఆరోప‌ణ చేశారు.

ఎలాగైనా తన మామ, సీఎం కేసీఆర్‌ను గజ్వేల్‌లో ఓడించాలని హరీశ్‌ తనను కోరినట్లు ప్ర‌తాప్‌రెడ్డి వెల్లడించారు. ఓ ప్రైవేట్‌ నెంబర్‌ నుంచి హరీశ్‌రావు తనకు ఫోన్‌ చేశారని ఒంటేరు అన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించాలని, ఆర్థికంగా కూడా అండ‌గా ఉంటాన‌ని త‌న‌తో అన్నార‌ని ప్ర‌తాప్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే, అవినీతి సొమ్ముతో గెల‌వాల్సిన అవ‌స‌రం నాకు లేద‌ని, నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు, యువ‌త ఈసారి త‌న‌కు మ‌రింత అండ‌గా ఉన్నార‌ని చెప్పిన‌ట్టు వెల్ల‌డించారు. కేటీఆర్ కోసం కేసీఆర్ త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తును ప‌ణంగా పెడుతున్నాడ‌ని అందుకే ఈ సాయం అడుగుతున్న‌ట్లు హ‌రీష్ రావు చెప్పార‌ని ప్ర‌తాప్‌రెడ్డి వెల్ల‌డించారు. ఈ విషయాన్ని దేవుడిపై ప్ర‌మాణం చేసి ఎక్క‌డ‌యినా చెప్ప‌గ‌ల‌ను అని ఒంటేరు ప్ర‌తాప‌రెడ్డి వ్యాఖ్యానించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English