బాబు దూకుడు.. జ‌గ‌న్ డీలా

బాబు దూకుడు.. జ‌గ‌న్ డీలా

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెండు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి పార్టీలైన టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో ప్ర‌స్తుతం ప‌ర‌స్ప‌రం భిన్న ప‌రిస్థితి నెల‌కొంది. చంద్ర‌బాబు నాయుడు త‌న దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూ జాతీయ రాజ‌కీయాల్లో సైతం చ‌క్రం తిప్పుతుండ‌టంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఆ పార్టీ సిద్ధ‌మ‌వుతోంది. అదే స‌మ‌యంలో రాష్ట్రంలో వైసీపీ శ్రేణులు మాత్రం కాస్త నిస్తేజంగా క‌నిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ పాద‌యాత్ర‌తో కాస్తో కూస్తో హంగామా చేసిన త‌మ అధ్య‌క్షుడు జ‌గ‌న్.. ఇప్పుడు కోడి క‌త్తి దాడిలో గాయ‌ప‌డి ఇంటికే ప‌రిమిత‌మ‌వ్వ‌డంతో ఆ పార్టీలో నిరుత్సాహం అలుముకుంది.

బీజేపీతో తెగ‌దెంపులు చేసుకున్నాక చాన్నాళ్లు మౌనంగానే ఉన్న చంద్ర‌బాబు తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డ‌టంతో జోరు పెంచారు. దేశాన్ని ర‌క్షించుకోవాలంటే బీజేపీని ఓడించాల్సిందేన‌ని చెబుతూ.. ఇన్నాళ్లూ త‌మ‌కు ప్ర‌త్య‌ర్థిగా ఉన్న కాంగ్రెస్‌తో జ‌ట్టుక‌ట్టారు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ, మాయావ‌తి, శ‌ర‌ద్ ప‌వార్, శ‌ర‌ద్ యాద‌వ్‌, కేజ్రీవాల్ స‌హా ప‌లువురు కీల‌క నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు.

చంద్ర‌బాబు కాంగ్రెస్‌తో జ‌ట్టు క‌ట్ట‌డంపై విమ‌ర్శ‌లు కూడా వెల్లువెత్తినా.. దేశ రాజ‌కీయాల్లో త‌మ నాయ‌కుడు చ‌క్రం తిప్పుతుండ‌టాన్ని చూసి టీడీపీలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. హ‌స్తంతో పొత్తు న‌చ్చ‌క కొంద‌రు పార్టీని వీడినా.. ఆ న‌ష్ట‌మేమీ తిరిగి పూరించుకోలేని స్థాయిలో ఉండ‌ద‌ని వారు ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు కార‌ణంగా తెలంగాణ‌లోనూ త‌మ పార్టీ తిరిగి జ‌వ‌స‌త్వాలు సంత‌రించుకుంటుంద‌ని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌త్యేక‌ హోదా ఇవ్వ‌కుండా రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీపై చంద్ర‌బాబు పోరాడుతున్న తీరు ఏపీలో త‌మ‌కు బాగా ల‌బ్ధి చేకూరుస్తుంద‌ని అంచ‌నాలు వేసుకుంటున్నారు.

వైసీపీ ప‌రిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. నిజానికి టీడీపీ కంటే ముందు నుంచే వైసీపీ ఎన్నిక‌ల స‌న్నాహం మొద‌లు పెట్టింది. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర పేరుతో నిర్వ‌హిస్తున్న పాద‌యాత్ర‌కు ఇన్నాళ్లూ బాగానే జ‌నాద‌ర‌ణ ద‌క్కింది. అయితే - విశాఖ విమానాశ్ర‌యంలో జ‌గ‌న్‌పై దాడి ఘ‌ట‌న అనంత‌రం స‌మీక‌ర‌ణాలు క్ర‌మంగా మారాయి. గాయం చిన్న‌దే అయినా జ‌గ‌న్ తాత్సారం చేస్తున్నారంటూ ప్ర‌జ‌లు చెవులు కొరుక్కుంటున్నారు. దాడి అనంత‌రం రెండు రోజుల్లో తిరిగా పాద‌యాత్ర‌ను ప్రారంభిస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్ ఇప్ప‌టికీ దాన్ని మొద‌లుపెట్ట‌లేదు. ఇంకో వారం రోజుల వ‌ర‌కు ప్రారంభించే అవ‌కాశాలూ లేవు. దీంతో వైసీపీ శ్రేణుల్లో నిరుత్సాహం ఆవ‌హించింది.

ఇక హ‌స్తిన‌లో చంద్ర‌బాబు చ‌క్రం తిప్పుతున్న తీరు చూసి జ‌గ‌న్ కూడా ఆందోళ‌న చెందుతున్నార‌ట‌. బాబు కాంగ్రెస్‌తో క‌ల‌వ‌డం ఆయ‌న‌కు రుచించ‌డం లేద‌ట‌. రాష్ట్రాన్ని విభ‌జించి కాంగ్రెస్ చేసిన న‌ష్టం కంటే.. హోదా ఇవ్వ‌కుండా బీజేపీ చేసిన ద్రోహ‌మే పెద్ద‌ద‌ని ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బాబు బీజేపీని వీడి కాంగ్రెస్‌తో చేర‌డంతో.. జాతీయ స్థాయిలో తాను ఎవ‌రికి మ‌ద్ద‌తివ్వాలో తేల్చుకోలేక జ‌గ‌న్ త‌ల ప‌ట్టుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English