రెండు వారాల వ్య‌వ‌ధిలో జ‌గ‌న్ చేసిన పెద్ద త‌ప్పులివే!

రెండు వారాల వ్య‌వ‌ధిలో జ‌గ‌న్ చేసిన పెద్ద త‌ప్పులివే!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుందా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ విజ‌యంపై విశ్వాసం స‌న్న‌గిల్లిందా? అందుకే నైరాశ్యంలో కూరుకుపోయి త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తున్నారా? ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ అవున‌నే స‌మాధానం చెప్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. కేవ‌లం రెండు వారాల వ్య‌వ‌ధిలో రెండు పెద్ద త‌ప్పులు చేసి ప్ర‌జ‌ల ముందు జ‌గ‌న్ అడ్డంగా బుక్క‌యిన తీరును ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా వారు సూచిస్తున్నారు.

రెండు పెద్ద త‌ప్పుల్లో మొద‌టిది.. తిత్లీ తుపాను స‌మ‌యంలో జ‌గ‌న్ స్పందించిన తీరు. ఉత్త‌రాంధ్ర‌ను తిత్లీ వణికించింది. ముఖ్యంగా శ్రీ‌కాకుళం జిల్లాలోని కొన్ని మండ‌లాలను క‌కావిక‌లం చేసింది. దీంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స్వ‌యంగా శ్రీ‌కాకుళం వెళ్లి తుపాను ప్ర‌భావిత ప్రాంతాల‌ను ప‌రిశీలించారు. బాధితుల‌ను ఓదార్చారు. త‌న సొంత ప‌నుల‌ను చ‌క్క‌బెట్టుకున్నాక‌ కాస్త ఆల‌స్యంగానైనా..  ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా శ్రీ‌కాకుళం వెళ్లారు. బాధితుల‌తో మాట్లాడారు.

జ‌గ‌న్ మాత్రం బాధితుల ప‌ట్ల ఇవేమీ త‌న‌కు ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించారు. వాస్త‌వానికి తుపాను క‌ల్లోలం సంభ‌వించిన‌ప్పుడు శ్రీ‌కాకుళం ప‌క్క జిల్లాలోనే ప‌ర్య‌టిస్తున్నారు. అయినా తుపాను ప్ర‌భావిత ప్రాంతాల‌కు వెళ్లేందుకు ఆయ‌న మొగ్గు చూప‌లేదు. దీంతో ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల ముందు ఆయ‌న విల‌న్‌గా మారార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. రాజ‌కీయాల్లో త‌న కంటే జూనియ‌ర్ అయిన ప‌వ‌న్‌కు ఉన్న క‌నీస ఇంగిత జ్ఞానం కూడా జ‌గ‌న్‌కు లేవ‌ని వారు విమ‌ర్శిస్తున్నారు.

ఇక విశాఖ విమానాశ్ర‌యంలో కోడి క‌త్తితో త‌న‌పై దాడి జ‌రిగిన అనంత‌రం జ‌గ‌న్ స్పందించిన తీరు కూడా ఆయ‌న‌కు మైన‌స్ పాయింట్‌గా మారింద‌న్న‌ది విశ్లేష‌కుల వాద‌న‌. దాడిలో జ‌గ‌న్ స్వ‌ల్పంగానే గాయ‌ప‌డ్డారు. ఆ స‌మ‌యంలో అత్య‌వ‌స‌రంగా చికిత్స తీసుకోక‌పోతే పెద్ద‌గా న‌ష్ట‌మేం ఉండేది కాదు. కాబ‌ట్టి త‌న‌పై దాడిని హ‌త్యాయ‌త్నంగా ఆరోపిస్తూ విమానాశ్ర‌యం ముందే ఆందోళ‌న‌కు దిగి ఉంటే.. జ‌గ‌న్ మైలేజ్ బాగా పెరిగి ఉండేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అందుకు పూర్తి భిన్నంగా వ్య‌వ‌హ‌రించిన జ‌గ‌న్‌.. విశాఖ నుంచి హైద‌రాబాద్ వెళ్లి చికిత్స చేయించుకున్నారు. త‌న‌కు చికిత్స చేసేందుకు విశాఖ‌లో ఆస్ప‌త్రులే లేవా అంటే ఆయ‌న నుంచి స‌మాధాన‌మే క‌ర‌వైంది. ఇక దాడిపై వాంగ్మూలం ఇవ్వాలంటూ త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ఏపీ పోలీసుల‌ను తొలుత తిప్పి పంపిన జ‌గ‌న్‌.. ఆ మ‌రుస‌టి రోజు పిలిచిమ‌రీ వాంగ్మూల‌మిచ్చారు.

ఏపీ పోలీసుల ద‌ర్యాప్తుపై త‌న‌కు న‌మ్మ‌కం లేదంటూ భిన్న‌ర‌కాల వాద‌న‌లు వినిపించారు. ఈ మొత్తం వ్య‌వ‌హారం జ‌గ‌న్‌కు న‌ష్టాన్నే ఎక్కువ క‌లుగజేసింద‌న్న‌ది విశ్లేష‌కుల అభిప్రాయం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి ఓట‌మి త‌ప్ప‌ద‌ని జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నార‌ని.. అందుకే నైరాశ్యంతో ఇలా త‌ప్పుల మీద త‌ప్పులు చేసి జ‌నం ముందు అడ్డంగా బుక్క‌వుతున్నార‌ని వారు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English