ఆ 18 మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హత వేటు!

ఆ 18 మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హత వేటు!

ప్ర‌స్తుతం దేశంలో ఆ పార్టీ...ఈ పార్టీ అని తేడా లేకుండా జంప్ జిలానీలు పెరిగిపోతోన్న సంగ‌తి తెలిసిందే. ఒక పార్టీ గుర్తుపై గెలిచి...ఆ త‌ర్వాత త‌మ స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం వేరే పార్టీలో చేర‌డం...ఆ పార్టీలో మంత్రి ప‌ద‌వుల‌ను కూడా అనుభ‌వించ‌డం నిత్య‌కృత్య‌మైంది. ఈ ర‌కంగా పూట‌కో పార్టీ మార్చే ఊస‌ర‌వెల్లుల‌పై అన‌ర్హత వేటు వేయ‌డం.....పార్టీ ఫిరాయింపుల చ‌ట్టం ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవ‌డం....వంటివి అరుదుగా జ‌రుగుతుంటాయి.

ఏపీ, తెలంగాణ‌లో కూడా పలువురు ఎమ్మెల్యేలు య‌ధేచ్ఛగా పార్టీ ఫిరాయించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా జంప్ జిలానీల‌పై మ‌ద్రాసు హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత చెల్లుతుంద‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. 18మంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేలపై త‌మిళ‌నాడు అసెంబ్లీ స్పీకర్‌ విధించిన అనర్హత వేటును మద్రాస్‌ హైకోర్టు సమర్థించింది. ఆ 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో పళనిస్వామి ప్రభుత్వానికి మద్రాస్‌ హైకోర్టులో ఊరట లభించిన‌ట్ల‌యింది.

కొద్ది రోజుల క్రితం 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు....దిన‌క‌ర‌న్ గూటికి చేరారు. వారంతా....పార్టీ విప్ కు వ్యతిరేకంగా వ్యవహరించి.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో, తమిళనాడు స్పీకర్‌ ధన్‌పాల్....గత‌డాది 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. అయితే, ఆ అనర్హత వేటు కేసులో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువరించింది.

అనర్హత వేటు చెల్లుతుందని జస్టిస్‌ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా..చెల్లబోదని జస్టిస్‌ సెల్వం తీర్పు వెలువరించారు. తాజాగా మూడో న్యాయ‌మూర్తి....ఆ అనర్హత వేటును సమర్థించడంతో ఎమ్మెల్యేల బహిష్కరణ అనివార్య‌మైంది. తాజా తీర్పుతో తమిళనాడు అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 213కు పడిపోయింది. దీంతో, పళనిస్వామి ప్రభుత్వం మ‌నుగ‌డ‌కు అవ‌స‌ర‌మైన‌ 110 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయితే, ఆ 18 స్థానాల ఉప ఎన్నికల ఫ‌లితాల‌ను బ‌ట్టి ప‌ళ‌ని ప్ర‌భుత్వం భ‌విష్య‌త్తు తేల‌నుంది. మ‌రోవైపు, ఆ తీర్పును టీటీవీ దినకరన్ స్వాగ‌తించారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English