బాబు లెక్క నిజ‌మైంది..మోడీతో గ‌వ‌ర్న‌ర్ భేటీ

బాబు లెక్క నిజ‌మైంది..మోడీతో గ‌వ‌ర్న‌ర్ భేటీ

ఏక‌కాలంలో ఇటు ఢిల్లీలో అటు అమ‌రావ‌తిలో కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. అత్యంత ఆస‌క్తిక‌రంగా ఈ రెండూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంగా జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యంలో ఇటు బాబు చెప్పిన అంచ‌నాలే దాదాపుగా నిజ‌మ‌య్యాయ‌ని ప‌లువురు అంటున్నారు. ముందుగా దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప‌రిగిన ప‌రిణామాల‌ను తీసుకుంటే...ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వారిద్ద‌రి మ‌ధ్య కీల‌క చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఈ బేటీని ఊహించిన‌ట్లు అమరావతిలో జరుగుతున్న 2వరోజు కలెక్టర్ల సదస్సులో చంద్ర‌బాబు మాట్లాడ‌టం మ‌రో ట్విస్ట్‌.

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై దాడి జ‌రిగిన మ‌రుస‌టి రోజు ఢిల్లీ వెళ్లిన గ‌వ‌ర్న‌ర్ ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివేదిక స‌మ‌ర్పించిన‌ట్లు స‌మాచారం. రెండు రాష్ర్టాల్లో జ‌రుగుతున్న సీబీఐ దాడుల‌ను సైతం ఆయ‌న ప్ర‌స్తావించిన‌ట్లు తెలుస్తోంది. దీంతోపాటుగా రెండు రాష్ర్టాల్లో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల గురించి సైతం ప్ర‌ధాని మోడీకి గ‌వ‌ర్న‌ర్ నివేదిక ఇచ్చిన‌ట్లు స‌మాచారం. తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల తీరుపై ఆయ‌న వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తోంది. ఈ భేటీ గురించి అధికారికంగా గ‌వ‌ర్న‌ర్ ఎలాంటి స‌మాచారం మీడియాకు ఇవ్వ‌లేదు.

ఇదిలాఉండ‌గా...క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గవర్నర్ల వ్యవస్ధ వలన ఎటువంటి ఉపయోగం లేదని తాను చాలా ఏళ్లుగా చెపుతున్నానని, గవర్నర్లు కేంద్రానికి సీక్రెట్ ఏజెంట్లుగా పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విశాఖ విమానాశ్రయంలో  ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి పై దాడి జరిగితే గవర్నర్ తనను అడగకుండా నేరుగా డీజీపీ తో మాట్లాడటం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు.

ఆపరేషన్ "గరుడ" అన్నప్పుడు నేను సీరియస్ గా తీసుకోలేదని, అందులో భాగంగానే నిన్న జగన్ మోహన్ రెడ్డి పై దాడి జరిగిందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో దేవాలయాల వద్ద దాడులు చేసే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇన్నేళ్లుగా  రాజకీయాల్లో ఉన్నానని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ఇక ఎవరి ఆటలు సాగనివ్వను అని ముఖ్యమంత్రి  ధీమాగా చెప్పారు.

నేరప్రవృత్తి కలిగిన వారు రాజకీయాల్లో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమేనని  అన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితి, నక్సలైట్ల సమస్యలపై సమీక్ష నిర్వహించారు. రాజకీయ నాయకులు దాడులకు పాల్పడితే పోలీసులు ఎవరికీ భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు.

ఆందప్రదేశ్ కు ప్రత్యేక హోదా అడిగితే ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం జగన్ తో కుమ్మక్కై రాష్ట్రంలో ఐటీ దాడులు చేయిస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఇంకా ఐటీ దాడులు జరుగుతాయని, ఎవ్వరూ అధైర్యపడవద్దని, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని చంద్రబాబునాయుడు అన్నారు. ఐటీ దాడుల వల్ల వ్యాపారస్తులు  భయపడి పోతున్నారని, అభివృధ్దిని అడ్డుకునే పనులు సమాజానికి పనికిరావని ఆయన అన్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English