అచ్చూ మాల్యాలాగే ఈ పెద్దాయ‌న జంప్‌

అచ్చూ మాల్యాలాగే ఈ పెద్దాయ‌న జంప్‌

అప్పుల పాలై, బ్యాంకుల‌కు రుణాలు ఎగ్గొట్టిన మ‌రో బ‌డాబాబు దేశం నుంచి జంప్ అయ్యాడు. చిత్రంగా సుమారు తొమ్మిది వేల కోట్ల రుణాలను ఎగవేసిన విజయ్‌ మాల్యా విదేశాలకు పారిపోయేందుకు లుక్‌ఔట్‌ నోటీసులను సీబీఐ లైట్ తీసుకున్న‌ట్లుగానే తాజా ఉదంతంలో కూడా జ‌రిగింద‌నే ప్ర‌చారం తెర‌మీద‌కు వ‌స్తోంది.

ఎయిర్‌సెల్‌ మాజీ ప్రమోటర్‌, ఐడీబీఐ బ్యాంకులో 600 కోట్ల కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న సి శివశంకరన్ ఇలా జంప్ జిలానీగా మారారు. అయితే, ఆయ‌న‌పై జారీ చేసిన లుక్‌ ఔట్‌ నోటీసులను సీబీఐ నీరుగార్చినట్టు కొన్ని రాజ‌కీయ పార్టీలు ఆరోపిస్తుండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఎయిర్‌సెల్ వ్య‌వ‌స్థాప‌కుడైన‌ శివశంకరన్ ఐడీబీఐ బ్యాంక్‌లో రూ.600 కోట్ల కుంభ‌కోణానికి పాల్ప‌డ‌టం సంచ‌ల‌నం సృష్టించింది. 2010 నుంచి 2014 మధ్యకాలంలో ఐడీబీఐలో జరిగిన 600 కోట్ల కుంభకోణానికి సంబంధించి సి శివశంకరన్‌, ఐడీబీఐ అధికారి ఎంఎస్‌ రాఘవన్‌ సహా 39మందిపై ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్యాంక్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఫ్రాడ్‌ సెల్‌(బీఎస్‌ఎఫ్‌సీ)లో సీబీఐ కేసును నమోదు చేసింది.

విచార‌ణ నేప‌థ్యంలో బెంగుళూర్‌లోని బీఎస్‌ఎఫ్‌సీలో దాఖలైన ఈ కేసును ఢిల్లీలోని యాంటి కరప్షన్‌ యూనిట్‌-3కు బదిలీ చేసింది. కాగా, శివశంకరన్‌ రాకపోకలపై సీబీఐ కఠినంగా వ్యవహరించకుండా అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుందని ప‌లు పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. శివశంకరన్‌పై జారీ అయిన లుక్‌ఔట్‌ నోటీసులపై నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన అవసరం లేదని ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు సూచనలు చేయాల్సిందిగా బెంగుళూర్‌ బ్రాంచ్‌ హెడ్‌, సంబంధిత ఐఓలకు సీబీఐ ఉన్నత వర్గాలు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్టు విమ‌ర్శిస్తున్నారు.

భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లే అవకాశం కల్పించేలా ఈ నోటీసులను మార్చివేసినట్టు తెలుస్తోంది. ఐడీబీఐ బ్యాంకు కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీసర్‌(ఐఓ), సంబంధిత సీబీఐ బెంగుళూర్‌ బ్రాంచ్‌ హెడ్‌ ఈ నిర్ణయంతో విబేధించినా సీబీఐ ఉన్నత అధికార వర్గాలు ఈ చర్యకు పూనుకున్నట్టు తెలిసింది. 2జీ స్కాంకు సంబంధించి ఎయిర్‌మ్యాక్సిస్‌ కేసులోనూ శివశంకరన్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం గమనార్హం. ఈ విష‌యంలో అధికార‌పార్టీని దోషిగా పేర్కొంటూ విప‌క్షాలు విరుచుకుప‌డ‌టం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English