మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో కేటీఆర్

మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో కేటీఆర్

ఎన్నిక‌ల వేళ తెలంగాణ‌లో భారీ విధ్వంసం సృష్టించేందుకు మావోయిస్టులు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్‌లోని కొంద‌రు అగ్ర నేత‌ల‌ను వారు ల‌క్ష్యంగా చేసుకున్నార‌ని.. త‌మ వ్యూహ ర‌చ‌న అమ‌లుకు స‌రైన ప్రాంతం, స‌మ‌యం కోసం ఎదురుచూస్తున్నార‌ని స‌మాచారం. ప్ర‌ధానంగా గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌ను మావోలు టార్గెట్ చేస్తున్న‌ట్లు నిఘా వ‌ర్గాల నుంచి స‌మాచారం అందుతోంది.

రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా చోటుచేసుకున్న ఘ‌ట‌న‌.. నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌లు స‌రైన‌వేన‌ని రుజువు చేస్తోంది. తంగెళ్ల‌ప‌ల్లి మండ‌లం జిల్లెల్లలో కేటీఆర్ తాజాగా ప‌ర్య‌టించారు. అక్క‌డ త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న పోలీసుల‌కు జ‌న‌శ‌క్తి విప్ల‌వ పార్టీ జిల్లా కార్య‌ద‌ర్శి జ‌క్కుల బాబు, మ‌రో మావోయిస్టు శ్రీకాంత్ ప‌ట్టుబ‌డ్డారు. వారి వ‌ద్ద నుంచి అమెరికాలో త‌యారు చేసిన సెమీ ఆటోమెటిక్ రివాల్వ‌ర్, 15 బెల్లెట్లు, రూ.46 వేల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అనంత‌రం పోలీసులు త‌మ‌దైన శైలిలో బాబు, శ్రీ‌కాంత్‌ల‌ను ఇంట‌రాగేట్ చేయ‌గా.. అస‌లు విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. కేటీఆర్‌ను హ‌త్య చేసేందుకు తాము ప్ర‌ణాళిక ర‌చిస్తున్నామ‌ని.. అందులో భాగంగానే తాజాగా రెక్కీ నిర్వ‌హించామ‌ని వారు బ‌య‌ట‌పెట్టారు. తెలంగాణ‌లో మ‌రింత మంది కీల‌క నేత‌ల‌ను హ‌త‌మార్చేందుకు తాము వ్యూహాలు పన్నుతున్నామ‌ని వెల్ల‌డించారు. దీంతో పోలీసులు సంబంధిత స‌మాచారాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.

ఇటీవ‌లే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ‌లను కాల్చి చంప‌డం ద్వారా మావోయిస్టులు క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అదే త‌ర‌హాలో తెలంగాణ‌లోనూ త‌మ ఉనికిని బ‌లంగా చాటుకోవాల‌ని ఇక్క‌డి మావోయిస్టులు ఉవ్విళ్లూరుతున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే చిన్నాచిత‌క నేత‌ల‌ను కాకుండా కేటీఆర్ వంటి బ‌డా నేత‌ల‌ను వారు టార్గెట్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

దేశంలో న‌క్స‌లిజంను 2-3 ఏళ్ల‌లో పూర్తిగా అంతం చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో.. బీజేపీ సీనియ‌ర్ నేత‌ల పేర్ల‌ను కూడా మావోలు త‌మ హిట్‌లిస్ట్‌లో చేర్చుకున్నార‌ని స‌మ‌చారం. వారిని చంప‌డం ద్వారా కేంద్రానికి త‌మ‌దైన శైలిలో హెచ్చ‌రిక‌లు పంపాల‌న్న‌ది మావోల యోచ‌న‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English