క‌డియం కూతురికి కేసీఆర్ భ‌రోసా

క‌డియం కూతురికి కేసీఆర్ భ‌రోసా

స్టేష‌న్ ఘ‌న్‌పూర్ అసెంబ్లీ టికెట్ వ్య‌వ‌హారం క‌డియం శ్రీ‌హ‌రి ఇంట్లో రాజ‌కీయ చిచ్చుకు కార‌ణ‌మ‌వుతుండ‌టంతో ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దేందుకు స్వ‌యంగా గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ బ‌రిలో దిగిన‌ట్లు తెలుస్తోంది. క‌డియం రాజ‌కీయ వార‌సురాలిగా గుర్తింపు పొందిన ఆయ‌న కుమార్తె డాక్ట‌ర్ కావ్య‌ను కేసీఆర్ బుజ్జ‌గిస్తున్న‌ట్లు స‌మాచారం. నీ రాజ‌కీయ భ‌విష్య‌త్తును నేను చూసుకుంటాన‌ని.. ఏమాత్రం ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని టీఆర్ఎస్ బాస్ నుంచి ఆమెకు భ‌రోసా ల‌భించిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి.

స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో త‌మ అభ్య‌ర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య పేరును టీఆర్ఎస్ ఖ‌రారు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ టికెట్ త‌మ కుటుంబానికి ద‌క్క‌క‌పోవ‌డంపై క‌డియం కుమార్తె డాక్ట‌ర్ కావ్య తీవ్రంగా నొచ్చుకున్నారు. రాజయ్య‌కు నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా చాలా ప్ర‌తికూల‌త‌లున్నాయ‌ని.. ఆయ‌న గెలిచే అవ‌కాశాలు దాదాపుగా లేవ‌ని ఆమె చెబుతున్నారు.

టికెట్ త‌మ కుటుంబానికే ద‌క్కేలా గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేయ‌లేదంటూ తండ్రి క‌డియంపై ఆమె అల‌కబూనారు. అభ్య‌ర్థుల జాబితాలో మార్పులేవీ చేయ‌బోమ‌ని పార్టీ అధినేత కేసీఆర్, ఆయ‌న కుమారుడు కేటీఆర్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తిని క‌డియం గుర్తుచేసినా.. ఆమె ప‌ట్టు విడ‌వ‌లేదు. రాజ‌య్య విజ‌యం కోసం తాను చిత్త‌శుద్ధితో ప‌నిచేయ‌బోన‌ని సంకేతాలిచ్చారు. త‌న‌కు టికెట్ ఇప్పించాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టారు.

టికెట్ వ్య‌వ‌హారం క‌డియం ఇంట్లో చిచ్చుకు కార‌ణ‌మ‌వుతుండ‌టం కేసీఆర్ దృష్టికి వ‌చ్చింది. తండ్రీ కూతుళ్ల మ‌ధ్య గొడ‌వ కార‌ణంగా రాజ‌య్య విజ‌యావ‌కాశాల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డే అవ‌కాశ‌ముంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. దీంతో క‌డియంతో కేసీఆర్ స్వ‌యంగా మాట్లాడిన‌ట్లు తెలిసింది. కావ్య‌ రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై ఎలాంటి ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని క‌డియంకు ఆయ‌న భ‌రోసా ఇచ్చార‌ని.. కావ్య‌తో కూడా ఈ విష‌యంపై మాట్లాడార‌ని స‌మాచారం.

అసెంబ్లీ టికెట్ ద‌క్క‌నంత మాత్రాన కంగారు ప‌డొద్ద‌ని.. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కావ్య‌కు ఎంపీ టికెట్ ఇచ్చే అవ‌కాశాన్ని గ‌ట్టిగా ప‌రిశీలిస్తామ‌ని గులాబీ ద‌ళ‌ప‌తి హామీ ఇచ్చిన‌ట్లు ప‌లువురు చెవులు కొరుక్కుంటున్నారు. ప్రస్తుతానికి రాజయ్య విజ‌యం కోసం శాయ‌శ‌క్తులా కృషి చేయాల‌ని తండ్రీ కూతుళ్ల‌కు ఆయ‌న దిశా నిర్దేశం చేసిన‌ట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English