కూతుర్ని బుజ్జ‌గిస్తున్న క‌డియం

కూతుర్ని బుజ్జ‌గిస్తున్న క‌డియం

స్టేష‌న్ ఘ‌న్‌పూర్ టికెట్ వ్య‌వ‌హారం తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ఉప ముఖ్య‌మంత్రి - టీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కులు క‌డియం శ్రీ‌హ‌రికి పెద్ద‌ త‌ల‌నొప్పిగా మారింది. టికెట్ కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నించ‌డం లేదంటూ సొంత కుటుంబ స‌భ్యులే ఆయ‌న తీరును త‌ప్పుప‌డుతున్నారు. గెలిచే అవ‌కాశాలు మెండుగా ఉన్న స్థానాన్ని వ‌దిలేయ‌డం ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో అటు పార్టీకి, ఇటు కుటుంబ స‌భ్యులకు న‌చ్చ‌చెప్ప‌లేక ఆయ‌న స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో తాటికొండ రాజ‌య్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎస్సీ కోటాలో కేసీఆర్ మంత్రివ‌ర్గంలో ఉప ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అయితే, ఆ త‌ర్వాత అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో రాజ‌య్య ప‌ద‌వి కోల్పాయాడు. దీంతో ఎస్సీ కోటా కింద ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌విని భ‌ర్తీ చేయాల‌ని భావించిన కేసీఆర్‌.. అప్ప‌ట్లో ఎంపీగా ఉన్న క‌డియం శ్రీ‌హ‌రికి శాస‌న‌మండ‌లిలో సభ్య‌త్వం క‌ల్పించారు. డిప్యూటీ సీఎం ప‌ద‌వినీ క‌ట్ట‌బెట్టారు.

తాజాగా ముంద‌స్తు ఎన్నిక‌ల కోసం ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల జాబితాలో స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌కే అప్ప‌గించాడు. వాస్తవానికి ఆ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌య్య కంటే శ్రీ‌హ‌రికే ప్ర‌జాద‌ర‌ణ ఎక్కువ‌. దీంతో శ్రీ‌హ‌రికి మ‌ద్ద‌తుగా ఆయ‌న అభిమానులు రోడ్డెక్కారు. ఆందోళ‌న‌లు, నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు.

స్టేష‌న్ ఘ‌న్‌పూర్ టికెట్‌ను శ్రీ‌హ‌రికే ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. అయితే, తాము ప్ర‌క‌టించిన జాబితాను మార్చేది లేద‌ని టీఆర్ఎస్ అధిష్ఠానం తేల్చిచెప్పింది. ఒక్క చోట అభ్య‌ర్థిని మార్చినా.. మిగ‌తా స్థానాల్లోనూ అస‌మ్మ‌తిసెగ‌లు ఎగిసిప‌డ‌తాయ‌ని సూచించింది. అభ్య‌ర్థుల‌ను మార్చాల‌ని ఇంకొన్ని చోట్ల‌ డిమాండ్ చేస్తార‌ని వెల్ల‌డించింది.
కాబ‌ట్టి రాజ‌య్య‌ను మార్చ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో కొన్నాళ్లు టికెట్ కోసం ప్ర‌య‌త్నించిన శ్రీ‌హ‌రి.. ఎట్ట‌కేల‌కు వెన‌క్కి త‌గ్గారు. మ‌ద్ద‌తుదారుల‌ను శాంతిప‌జేశారు.
మ‌ద్ద‌తుదారులు, అభిమానులు కాస్త శాంతించిన‌ప్ప‌టికీ.. క‌డియంకు ఇంటి పోరు మాత్రం త‌ప్ప‌ట్లేదు. ప్ర‌ధానంగా క‌డియం కుమార్తె డాక్ట‌ర్ కావ్య త‌న తండ్రి తీరును త‌ప్పుప‌డుతున్నారు. గెలిచే టికెట్‌ను వ‌దులుకోవాల్సిన అవ‌స‌ర‌మేంట‌ని తండ్రిని నిల‌దీస్తున్నారు. వాస్త‌వానికి తండ్రి బాట‌లోనే రాజ‌కీయాల్లోకి రావాల‌ని కావ్య ఆశిస్తున్నారు.

అందుకే కడియం ట్ర‌స్ట్ పేరుతో సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌వుతున్నారు. అయితే, త‌న తండ్రి పోటీకి దూరంగా ఉంటే.. జ‌నాల్లో ఆద‌ర‌ణ త‌గ్గిపోతుంద‌ని ఆమె భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో రాజ‌య్య గెలిచే అవ‌కాశాల కంటే ఓడిపోయే ఛాన్సులే ఎక్కువ‌ని ఆమె విశ్లేషిస్తున్నారు. కాబట్టి పార్టీ అధిష్ఠానం వ‌ద్ద మ‌రింత గ‌ట్టిగా టికెట్ కోసం ప్ర‌య‌త్నించాల‌ని తండ్రికి ఆమె సూచిస్తున్నారట‌. అయితే కేసీఆర్‌, కేటీఆర్‌ల‌ను కాద‌ని ముందుకెళ్ల‌డం మంచిది కాద‌ని.. పార్టీకి విధేయులుగా ఉండ‌ట‌మే మంచిద‌ని కూతుర్ని ప్ర‌స్తుతం క‌డియం బుజ్జ‌గిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English