కాంగ్రెస్ పై కేసీఆర్ సీక్రెట్ ఆప‌రేష‌న్‌

కాంగ్రెస్ పై కేసీఆర్ సీక్రెట్ ఆప‌రేష‌న్‌

తెలంగాణలో ముందస్తు ఎన్నికల పుణ్యమా అని రాజకీయం రసకందాయంలో పడింది. రోజురోజుకు కొత్త కొత్త మార్పులు, చేర్పులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఎత్తుగడలతో రాజకీయం వేడెక్కుతోంది. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి, అధికారాన్ని సాధించేందుకు మహాకూటమి పోటీ పడుతున్నాయి.

కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, వామపక్షాలతో ఏర్పడుతున్న మహాకూటమి తుది రూపు దాల్చలేదు. పొత్తులు కుదిరి ఏ పార్టీ ఎక్కడ నుంచి పోటి చేస్తుందో ఒకటి రెండు రోజులలో తేలనుంది. ఈ జాబితా వెలువడగానే తెలంగాణ రాష్ట్ర సమితి తన కొత్త వ్యూహానికి తెర తీయనున్నట్లు సమాచారం. ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి టిక్కెట్లు ఆశించి భంగ పడ్డ నాయకులను మహాకూటమిపై ప్రయోగించాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు రాని వారిని తెలంగాణ రాష్ట్ర సమితిలో చేర్చుకోకుండా వారంతా కాంగ్రెస్‌లోనే ఉంటూ మహాకూటమికి వెన్నుపోటు పొడిచే ప్రణాళికను రచిస్తున్నట్లు సమాచారం. టిక్కెట్టు ఆశిస్తున్న వారు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరితే ఓటరు వారిని వ్యతిరేకించే అవకాశం ఉందని అలా కాకుండా కాంగ్రెస్‌లోనే ఉంటూ ఆ పార్టీ అభ్యర్ది ఓటమికి పని చేసే విధంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి తిరిగి అధికారంలోకి వస్తే ఎన్నికలలో తమకు సహకరించిన కాంగ్రెస్ నాయకులను అప్పుడు పార్టీలో చేర్చుకోవాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌కు కోవర్టులుగా పనిచేసిన వారికి వివిధ పదవులు కట్టబెడతామని తాయిలాలు చూపిస్తారని సమాచారం. ఇలా కోవర్టులను తయారు చేసే బాధ్యతను ఆయా జిల్లాల మంత్రులకు అప్పగించాలని, వారి కనుసన్నలలోనే కోవర్టులు పని చేస్తారని వ్యూహం రచన చేస్తున్నట్లు చెబుతున్నారు.

కోవర్టులలో కొందరు ఎన్నికల అనంతరం ఇచ్చే పదవులపై అనుమానం వ్యక్తం చేస్తే అలాంటి వారికి భారీగా "బహుమానం" ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తాజాగా నిర్ణయించిన 40 సీట్లలో టిక్కెట్టు రాని కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. వారిని ముందుగా గుర్తించి కోవర్టులుగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి రంగం సిద్దం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English