క‌డియంపై కేసీఆర్ గుర్రు

క‌డియంపై కేసీఆర్ గుర్రు

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఒక‌టి. ఇక్క‌డ‌ టీఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టికే త‌మ అభ్య‌ర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్య‌మంత్రి టి.రాజ‌య్య పేరును ప్ర‌క‌టించింది. ఆయ‌న త‌న ప్ర‌చార ప‌ర్వాన్ని మొద‌లు పెట్టేశారు కూడా. అయితే, మ‌రో సీనియ‌ర్ నేత‌,  క‌డియం శ్రీహ‌రి స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ప్ర‌స్తుతం గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్‌ను అసంతృప్తికి గురిచేస్తోంద‌ని.. ఆగ్ర‌హం క‌లిగిస్తోంద‌ని స‌మాచారం.

గ‌త ఎన్నిక‌ల్లో స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నుంచి టి.రాజయ్య విజ‌యం సాధించారు. ద‌ళితుల కోటాలో ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. అయితే, అనంత‌రం చోటుచేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో రాజ‌య్య అనూహ్యంగా త‌న ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌విని కోల్పోయారు. ఎమ్మెల్యేగానే ప‌రిమిత‌మ‌య్యారు. అదే స‌మ‌యంలో ద‌ళితుల కోటా కింద రాజ‌య్య స్థానంలో ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌విని క‌డియం శ్రీ‌హ‌రి ద‌క్కించుకున్నారు. ఇందుకోసం ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసిన క‌డియం.. ఎమ్మెల్సీగా శాస‌న‌మండ‌లిలో అడుగుపెట్టారు.

ఇటీవ‌ల టీఆర్ఎస్ 105 మందితో త‌మ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల జాబితా ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో ర‌గ‌డ మొద‌లైంది. ఇక్క‌డ త‌మ పార్టీ అభ్య‌ర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రాజ‌య్య‌నే గులాబీ ద‌ళం అధినేత కేసీఆర్ ప్ర‌క‌టించారు. దీంతో క‌డియం మ‌ద్ద‌తుదారులు తీవ్రంగా నొచ్చుకున్నారు. రాజయ్య‌పై నియోజ‌క‌వర్గంలో తీవ్ర ప్ర‌తికూల‌త నెల‌కొంద‌ని.. ఆయ‌న్ను మార్చాల‌ని డిమాండ్ చేశారు. క‌డియంకు మద్ద‌తుగా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు.

ఎమ్మెల్యేగా పోటీ చేసే అవ‌కాశం ఆయ‌న‌కు ఇవ్వాల‌ని కోరారు. రాజ‌య్య ఎంపిక‌ను నిర‌సించారు. అభిమానులు, మ‌ద్ద‌తుదారుల నుంచి ఒత్తిడి ఎక్కువ‌వ్వ‌డంతో క‌డియం కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసే అంశాన్ని ఆలోచించారు. కేటీఆర్‌తో ఈ విష‌యంపై చ‌ర్చించారు. అయితే, తాము తొలుత ప్ర‌క‌టించిన జాబితాలో మార్పులు చేసే ప్ర‌స‌క్తే లేద‌ని కేటీఆర్ తేల్చిచెప్పారు. ఒక్క చోట అభ్య‌ర్థిని మార్చినా.. ఇత‌ర స్థానాల నుంచి నిర‌స‌న‌లు పెరుగుతాయ‌ని సూచించారు.

దీంతో క‌డియం మౌనంగా తిరిగొచ్చేశారు. కానీ, ఆయ‌న మ‌ద్ద‌తుదారులు మాత్రం శాంతించ‌డం లేదు. క‌డియంకు సీటివ్వాల్సిందేనంటూ నిర‌స‌న‌లు కొన‌సాగిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారంపై కేసీఆర్ గుర్రుగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. పార్టీ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉండాల‌ని, శాంతించాల‌ని క‌డియం చెప్తే ఆయ‌న మ‌ద్ద‌తుదారులు, అభిమానులు వింటార‌ని.. అయితే, అలాంటి ప్ర‌య‌త్నాలు చేయ‌కుండా క‌డియం కాల‌యాప‌న చేస్తున్నార‌ని కేసీఆర్ అసంతృప్తితో ఉన్న‌ట్లు స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English