15 మంది సీఎంల తో ప్రచారం

15 మంది సీఎంల తో ప్రచారం

తెలంగాణ‌లో స‌త్తా చాటేందుకు బీజేపీ స‌మాయత్తమ‌వుతోంది. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో గౌర‌వ‌ప్ర‌ద‌మైన సంఖ్య‌లో సీట్లు ద‌క్కించుకునేందుకు ప్రణాళిక‌లు ర‌చిస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్‌, మ‌హాకూట‌మిల మ‌ధ్య హోరాహోరీ త‌ప్ప‌ద‌ని అంచ‌నాలు వెలువ‌డుతున్న నేప‌థ్యంలో.. ప్ర‌భుత్వ ఏర్పాటులో కింగ్ మేక‌ర్‌గా నిలిచే స్థాయిలో స్థానాలు ద‌క్కించుకోవాల‌ని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం ప‌క్కా వ్యూహాల‌ను సిద్ధం చేస్తోంది. దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల నుంచి పార్టీ అతిర‌థ, మ‌హార‌థుల‌ను ప్ర‌చారానికి ర‌ప్పించాల‌ని యోచిస్తోంది.

తెలంగాణ‌లో బీజేపీ, టీఆర్ఎస్‌ల‌కు లోలోప‌ల పొత్తు కుదిరింద‌ని ఇటీవ‌ల జోరుగా ఊహాగానాలు వెలువ‌డ్డాయి. అధిష్ఠానం త‌మ‌కు చెప్ప‌కుండానే అలాంటి ఒప్పంద‌మేదైనా కుదుర్చుకుందా? అని రాష్ట్రంలో ప‌లువురు బీజేపీ నేత‌లు కూడా అనుమానాలు వ్య‌క్తం చేశారు. అయితే, రాష్ట్ర నేత‌ల‌తో ఇటీవ‌ల జ‌రిగిన అంత‌ర్గ‌త స‌మావేశంలో అమిత్ షా ఈ విష‌యంపై స్ప‌ష్ట‌తనిచ్చారు. టీఆర్ఎస్‌తో పొత్తేమీ లేద‌ని తేల్చిచెప్పారు. ఆ పార్టీతో దూకుడుగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆదేశాలిచ్చారు. పొత్తుల‌కు తాను పూర్తి వ్య‌తిరేక‌మ‌ని వెల్ల‌డించారు. మ‌హారాష్ట్రలో శివ‌సేన‌తో పొత్తు తెంచుకొని పార్టీని ఒంట‌రిగా అధికారంలోకి తీసుకొచ్చిన సంగ‌తిని గుర్తుచేశారు. శివ‌సేన కంటే టీఆర్ఎస్ బ‌ల‌మైందా? అని ప్ర‌శ్నించారు. దీంతో రాష్ట్ర పార్టీ నేత‌ల మ‌న‌సు లోలోతుల్లో ఉన్న అనుమానాల‌న్నీ ప‌టాపంచ‌ల‌య్యాయి. ఇక కారును బ‌లంగా ఢీకొట్టాల‌ని వారు నిర్ణ‌యించుకున్నారు.

తెలంగాణ  ఎన్నిక‌ల‌ను బీజేపీ అధిష్ఠానం కూడా ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంటోంది. దాదాపు 30 సీట్ల‌ను టార్గెట్‌గా చేసుకొని తీవ్రంగా శ్ర‌మించాల‌ని యోచిస్తోంది. వాటిలో 15 స్థానాలు ద‌క్కించుకున్నా స‌రే.. ప్ర‌భుత్వ ఏర్పాటులో కింగ్ మేక‌ర్‌గా మారొచ్చున‌ని భావిస్తోంది. అందుకే ప‌క్కా ప్ర‌చార వ్యూహాల‌ను సిద్ధం చేస్తోంది. దేశ‌వ్యాప్తంగా 15 రాష్ట్రాల సీఎంల‌ను తెలంగాణ‌కు ర‌ప్పించి ప్ర‌చారం చేయించాల‌ని యోచిస్తోంది.

అంతేకాదు, వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 100 మంది ఎంపీలు, ఎమ్మెల్య‌ను కూడా తీసుకొచ్చి.. ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని క‌మ‌ల‌నాథులు స‌న్నాహాలు చేస్తున్నారు. క‌ర్ణాట‌క స‌హా మ‌రికొన్ని రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు కొంద‌రు ఇప్ప‌టికే హైద‌రాబాద్‌కు చేరుకున్నారు కూడా. రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌(ఆరెస్సెస్‌) కూడా త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. రాష్ట్ర నేత‌ల‌కు శిక్ష‌ణ కార్య‌క్రమాలు ఏర్పాటుచేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English