ఆ అంబులెన్సులో ఉన్న‌ది వైసీపీ కార్య‌క‌ర్తే: ఉమ‌

ఆ అంబులెన్సులో ఉన్న‌ది వైసీపీ కార్య‌క‌ర్తే: ఉమ‌

విజయనగరం జిల్లా  చీపురుపల్లి నియోజకవర్గంలోని గుర్తలో వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బహిరంగ సభలో 108 అంబులెన్స్ రావ‌డం...దానికి దారిచ్చిన జ‌గ‌న్ ...టీడీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం తెలిసిందే. 108 అంబులెన్సుల ఉనికిని చాటి చెప్పాల‌ని ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఆ స‌భ మధ్యలోకి అంబులెన్సును పంపించారని ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు. అస‌లు అంబులెన్సులో పేషెంటే లేడని జ‌గ‌న్ నొక్కివ‌క్కాణించారు. ఈ నేప‌థ్యంలో అంబులెన్స్ పై కూడా రాజకీయాలు చేసిన జ‌గ‌న్ పై ప‌లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా, జగన్ పై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ అంబులెన్సులో మ‌నిషి ఉన్న‌దీ లేనిదీ కూడా చూడ‌కుండా జ‌గ‌న్ అవాకులు చ‌వాకులు పేలార‌ని మండిప‌డ్డారు. వాస్త‌వానికి ఆ అంబులెన్స్ లో ఉన్నది వైసీపీ కార్య‌క‌ర్త అని ఉమ అస‌లు వాస్త‌వాన్ని వెల్ల‌డించారు.

జగన్ సభకు హాజరయ్యేందుకు వ‌చ్చిన‌ వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లో ఓ కార్యకర్త గాయ‌ప‌డ్డార‌ని, ఆ కార్య‌క‌ర్త‌నే 108లో ఆసుప‌త్రికి త‌రలిస్తున్నార‌ని వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత ఆ కార్య‌క‌ర్త‌కు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించార‌ని ఉమ చెప్పారు. ప్ర‌తిప‌క్ష కార్యకర్తను రక్షించిన ప్ర‌భుత్వ  అంబులెన్సుపై కూడా జ‌గ‌న్ రాజ‌కీయం చేశార‌ని ఉమ మండిప‌డ్డారు. దీనిని కూడా ప్రభుత్వం వికృతమైన చర్య అని అన‌డం ఏమిట‌ని దుయ్య‌బ‌ట్టారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో అంబులెన్సు వెళ్లడానికి వేరే దారి లేక‌నే ...ఆ స‌భ గుండా వెళ్లవ‌ల‌సి వ‌చ్చింద‌ని అన్నారు. అయినా, ఇరుకు సందుల్లో సభలు పెట్టడం ఏమిటని జ‌గ‌న్ పై నిప్పులు చెరిగారు. జగన్ మాట్లాడిన భాష సరిగా లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులను బీజేఈ భయభ్రాంతులకు గురి చేస్తోంద‌ని, అయినా జ‌గ‌న్ మోదీని, బీజేపీని ప‌ల్లెత్తు మాట అన‌డం లేద‌ని మండిప‌డ్డారు. ఉమ వ్యాఖ్య‌ల‌తో జ‌గ‌న్ అడ్డంగా దొరికిన‌ట్ల‌యింద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English