శబరిమల లో మహిళా పోలీసులు?

శబరిమల లో  మహిళా పోలీసులు?

ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నీ ఒకెత్తయితే కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించి ఇచ్చిన తీర్పు మరో ఎత్తు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండగా ఇలాంటి తీర్పు రావడం.. తీర్పొచ్చినా కూడా బీజేపీ ప్రభుత్వం కానీ, ఆ పార్టీ నేతలు కూడా పెద్దగా ఆవేశపడకపోవడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. తీర్పు అనంతరం కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలన్నీ చూస్తుంటే దీని వెనుక బీజేపీ భారీ వ్యూహం ఉందన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. ఇప్పుడీ పరిణామాల నేపథ్యంలో బీజేపీ దీన్ని తన చేతుల్లోకి తీసుకోనుందని అంచనా వేస్తున్నారు.

శబరిమల ఆలయంలోకి పదేళ్ల నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలు ప్రవేశించరాదన్నది ఆచారం. దాన్ని సవాల్ చేస్తూ కొందరు సుప్రీంనాశ్రయించగా ప్రవేశం విషయంలో నిషేధం ఉండరాదని స్పష్టం చేయడం తెలిసిందే. అయితే, సుప్రీం ఇలా తీర్పిచ్చినా కూడా మహిళలు మాత్రం తాము 50 ఏళ్లు దాటేవరకు తాము శబరిమల ఆలయంలోకి వెళ్లబోమని... అది ఆచారమని తమకు తాము ముందుకొచ్చి చెబుతున్నారు. దీనిపై ఆన్‌లైన్లో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైంది. అంతేకాదు.. కేరళలో మహిళలు వీధుల్లోకొచ్చి సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో మాత్రం మాకు ఎలాంటి స్వేచ్ఛ, సమానత్వం అవసరం లేదని స్వచ్ఛందంగా చెబుతున్నారు.

అయితే.. ఈ తీర్పు వెలువడగానే కేరళ సీఎం పినరయి విజయ్ హర్షం వ్యక్తం చేశారు. మహిళల కోసం ఏకంగా మహిళా పోలీసులను నియమిస్తానని ప్రకటించారు. దాంతో అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజలు చేసే పూజారులు కూడా ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను వారు వ్యతిరేకిస్తున్నారు. సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా ప్రజల మనోభీష్టం మేరకు కేరళ ప్రభుత్వం రివ్యూ పిటీషన్ వేయాలని కోరుతున్నారు. రివ్యూ పిటిషన్ వేశాకే చర్చలకొస్తామని భీష్మించారు.

అంతేకాదు... కొట్టాయం, మలప్పురం జిల్లాల్లో ఈ తీర్పు, రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో కేరళ సర్కారు కూడా రివ్యూ పిటిషన్ వేయడానికి సిద్ధమవతున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఈ పరిస్థితులను కేరళలో బీజేపీ, ఆరెస్సెస్‌లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. దీనిపై కేరళ బీజేపీ రివ్యూ పిటిషన్ వేసే అవకాశం ఉందని సమాచారం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జోక్యం కూడా ఉండొచ్చని.. ఈ సమస్యను భక్తుల మనోభావాలకు అనుగుణంగా పరిష్కరించి మార్కులు కొట్టేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English