కేసీఆర్ పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే...

కేసీఆర్ పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే...

హుస్నాబాద్ ఆశీర్వాద సభ తరువాత బాగా గ్యాపిచ్చినా ఇప్పుడు వరుసగా ఒక్కో జిల్లాలో సభ పెట్టుకుంటూ వెళ్తున్న కేసీఆర్ పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా, తెలంగాణలో ఆయన జతకట్టిన కాంగ్రెస్‌పైనా తిట్ల వర్షం కురిపిస్తూ ప్రచార పర్వం సాగిస్తున్నారు. కేసీఆర్ వీరాభిమానులకు ఇది కనువిందుగా, వీనులవిందుగా ఉన్నప్పటికీ అసలు విషయం మాత్రం వేరేగా ఉంది. కేసీఆర్ చేతకానితనానికి... కేసీఆర్ పస తగ్గిపోయిందనడానికి ఈ ఉపన్యాసాలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. కేసీఆర్, టీఆరెస్ ఆరోపించినట్లుగా 60 ఏళ్లు ఆంధ్రపాలకుల చేతిలో మగ్గిపోయి అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయిన తెలంగాణను ఇప్పుడీ అయిదేళ్లలో కేసీఆర్ కొంతలో కొంత మార్చినట్లయితే ఆ సంగతి తన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రజలకు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు. దశాబ్దాల అన్యాయాన్ని కేసీఆర్ తుడిచివేస్తున్నట్లయితే ఆ సంగతి చెప్పడానికి ఒక గంట కాదు కదా 24 గంటల పాటు మాట్లాడినా చాలదు. కానీ, కేసీఆర్ తాను మాట్లాడే అరగంటో గంటో సమయం మొత్తం చంద్రబాబును, ఇతర ప్రత్యర్థులను తిట్టడానికే ఎందుకు కేటాయిస్తున్నారన్న ప్రశ్న అందరి నోటా వినిపిస్తోంది.

కత్తికి ఉండే పదునులా రక్తం చిమ్మిస్తూ కోసుకుపోయేలా ఉండేవి ఒకప్పటి కేసీఆర్ ఉపన్యాసాలు. కానీ, ఇప్పుడేదీ ఆ వాగ్ధాటి. ప్రత్యర్థులను నోటికొచ్చిన బాషలో తిట్టడాన్ని కేసీఆర్ అభిమానులు వాగ్ధాటి అనుకోవచ్చేమో కానీ చూసేవాళ్లకు, వినేవాళ్లకు అది నోటి తీట.. ఓటమి భయంతో కలుగుతున్న అక్కసుతో చేస్తున్న తిట్ల దాడి అని అర్థమవుతోంది.

ప్రగతి నివేదన సభ నుంచి మొదలుపెట్టి కేసీఆర్ ఉపన్యాసాలను పరిశీలిస్తే ఆయనలోని అసహనం స్పష్టంగా అర్థమవుతోంది. మాటల్లో పస ఉండడం లేదు. ప్రత్యర్థులను నానా తిట్లు తిట్టడం, ఎగతాళి చేయడం, దురహంకారంతో మాట్లాడడం, వెకిలి జోకులేయడం ఎక్కువైంది. ఇది చాలామందికి అక్కడికక్కడ నవ్వు తెప్పించొచ్చేమీ కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అది కేసీఆర్ వైఫల్యాన్ని చెప్పకనే చెబుతోంది.

తొలిసారి ముఖ్యమంత్రి అయి రెండో సారి మళ్లీ అవకాశం అందుకొనే ప్రయత్నం చేస్తూ... జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కూడా ఆశిస్తున్న నాయకుడు పరిణతి చూపాలే కానీ దిగజారితే అది సరైన సంకేతాలను పంపించదు. కానీ, కేసీఆర్ రోజురోజుకూ దిగజారుతున్నట్లుగానే అనిపిస్తోంది.

తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టకపోయినా వేగం పెంచిన ఘనత కేసీఆర్‌దే... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆయన తెచ్చిన ఒత్తిడొక్కటే కారణం కాకపోయినా అలాంటి పరిస్థితులు వచ్చేలా ఉద్యమాన్ని సజీవంగా ఉంచిన ఘనతా కేసీఆర్‌దే... కాబట్టే తెలంగాణ ఏర్పాటు తరువాత ఆయనకు అవకాశమిచ్చారు ప్రజలు. వచ్చింది బొటాబొటీ మెజారిటీయే అయినా కూడా ఆ తరువాత తన ప్రభుత్వాన్ని సుస్థిరంగా మార్చుకున్న కేసీఆర్ రాష్ట్రాన్ని మాత్రం స్థిరంగా ఎదిగేలా ఏమీ చేయలేకపోయారు. ఆ కారణంగానే ఆయనకు ఇప్పుడు చెప్పుకోవడానికేమీ కనిపించక ప్రత్యర్థులను విమర్శిస్తూ ఎన్నికలకు వెళ్తున్నారు. మరి, ఇదెంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English