ఫ్రస్ట్రేషన్... ఫ్రస్ట్రేషన్.. కేసీఆర్‌

ఫ్రస్ట్రేషన్...  ఫ్రస్ట్రేషన్..  కేసీఆర్‌

ఆయనో రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. ఆయన్నెవరూ ఏమీ అనకూడదట. ఆయన గురించి పల్లెత్తు మాటన్నా కూడా ఆయన అనుచరులు, భక్తులు విరుచుకుపడి నానా తిట్లూ తిడతారు. కానీ, ఆయన మాత్రం పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిని తన స్థాయి మరిచి మరీ దారుణమైన భాషలో తిడతారు. ఇదంతా ఎవరి గురించో ఈసరికే అర్థమై ఉంటుంది. ఇంకెవరు... తెలంగాణ సీఎం కేసీఆర్.. అవును.. ఆయన్నెవరైనా ఏమైనా పద్ధతి ప్రకారం విమర్శించినా కూడా అది దేశద్రోహంతో సమానమైన నేరంగా చిత్రీకరిస్తున్నారు. కానీ, ఆయన మాత్రం పొరుగు రాష్ట్రం సీఎం చంద్రబాబును నోటికొచ్చిన బూతులు తిడుతున్నారు.

తెలంగాణలో ఎన్నికల సందర్భంగా కేసీఆర్ చేస్తున్న ప్రసంగాలు చూస్తుంటే ఆయన స్థాయి బయటపడుతోందంటున్నారు విమర్శకులు. తనను ఓడించేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని... అందుకే కాంగ్రెస్‌తో చేతులు కలిపారని కేసీఆర్ పదేపదే గగ్గోలు పెడుతున్నారు. అసహనంతో రగిలిపోతున్నారు. కానీ, ఎన్నికల రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలను ఓడించడానికి రాజకీయం చేయడం కుట్ర కాదన్న సంగతి ఆయన మర్చిపోతున్నారు. ఆయన లక్ష్యం కూడా ప్రత్యర్థి పార్టీలను ఓడించడమేనన్న సంగతి మర్చిపోతున్నారు. టీడీపీ, కాంగ్రెస్‌తో కలిసినట్లే... తాను ఎంఐఎం, బీజేపీలతో సయోధ్యతో సాగుతున్న సంగతి మర్చిపోతున్నారు. అంతెందుకు? టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా.. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీతో తాను కలిసి ఎన్నికలకు వెళ్లానన్న సంగతీ మర్చిపోతున్నారు కేసీఆర్.

నిజానికి కేసీఆర్ మాటలు వింటుంటే.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీయే ప్రధాన ప్రతిపక్షం అన్నట్లుగా ఉంది. చంద్రబాబును చూసి కేసీఆర్ తెగ టెన్షన్ పడుతున్న సంగతి అర్థమవుతోంది. వాస్తవానికి గత ఎన్నికల తరువాత టీడీపీ నుంచి గెలిచిన నేతలను టీఆరెస్‌లోకి తీసుకోవడం ద్వారా ఆయన టీడీపీని దాదాపుగా లేవకుండా చేశారు. కానీ... ఇప్పుడు అదే టీడీపీని చూసి ఆందోళన చెందుతున్నారు. తన ఆందోళన, ప్రస్ట్రేషన్‌ను బయటపెట్టుకుంటూ టీడీపీకి ఆత్మవిశ్వాసం పెరిగేలా చేస్తున్నారు.

కేసీఆర్ ఇంతగా చంద్రబాబును తిట్టడానికి కారణాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తాను అనుకున్న కంటే భారీగా ఉండడం.. ఇదే సమయంలో కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టడంతో కేసీఆర్ ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన నేత కావడంతో ఆయన ఎటు నుంచి నరుక్కొస్తారో అన్న టెన్షన్ కేసీఆర్‌లో ఉంది. మరోవైపు  280 కోట్లు ఖర్చు పెట్టి నేయించిన బతుకమ్మ చీరెలను పంపిణీ చేయవద్దని ఎన్నికల సంఘం అనడం కూడా కేసీఆర్ ను షాక్ కు గురిచేసింది. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా కేసీఆర్ తిట్లలో కనిపిస్తోంది.

తాను ఇంతకాలం నమ్ముకున్న యాంటీ ఆంధ్రా సెంటిమెంటు రగిల్చే పరిస్థితులూ లేవు. హైదరాబాద్‌లో ఆంధ్రా నేతలకు టిక్కెట్లిచ్చారు.. తన చుట్టూ ఆంధ్రా కాంట్రాక్టర్లే కనిపిస్తున్నారు... ఇదంతా ప్రజలకు తెలియందేమీ కాదు.. దీంతో ఆంధ్రోళ్లను తిట్టినంత మాత్రాన ఓట్లు పడే పరిస్థితి లేదు. అందుకే.. అదంతా చంద్రబాబుపై మోపుతూ ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు కేసీఆర్.

అయితే... పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని పనిగట్టుకుని తిడుతున్న తాను... తనను తన రాష్ట్రంలోనివారు ఏమాత్రం విమర్శించినా తట్టుకోలేకపోతున్నారు. బహుశా కేసీఆర్‌లోని ఈ కోణం చూసేనేమో... ఆయనది దొర పాలన అని అంటారు. నేను ఎవర్నైనా కత్తితో పొడుస్తా... నన్ను మాత్రం ఎవరూ కంటితో కూడా చూడొద్దు అన్నట్లుగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌కు ఈ ఎన్నికల తరువాత తత్వం బోధపడుతుందన్నది విశ్లేషకుల మాట.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English