వైఎస్ ను కేసీఆర్‌ అంత మాట అన్నా స్పందించ‌వా జ‌గ‌న్‌?

 వైఎస్ ను కేసీఆర్‌ అంత మాట అన్నా స్పందించ‌వా జ‌గ‌న్‌?

ఏపీ ప్ర‌జ‌లంటే కేసీఆర్‌కు అంత లోకువా?  తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడిన కేసీఆర్‌.. అదేమ‌ని ప్ర‌శ్నిస్తే.. తాను ఆంధ్రోళ్ల గురించి మాట్లాడ‌లేద‌ని.. ఆంధ్రా పాల‌కుల గురించి మాట్లాడిన‌ట్లుగా చెప్పేవారు. ఆంధ్రా ప్ర‌జ‌ల‌తో త‌న‌కు పంచాయితీ లేద‌ని న‌మ్మ‌బ‌లికేవారు. ఆంధ్రా పాల‌కుల పేరుతో ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడి.. ఆంధ్రోళ్ల మ‌న‌సుల్ని ఎంత‌గా గాయ‌ప‌ర్చాలో అంత‌గా గాయ‌ప‌ర్చిన వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

తెలుగు ప్ర‌జ‌లం.. విడిపోయి క‌లిసి ఉందామ‌న్న మాట‌ను చెప్పి..  విడిపోయిన త‌ర్వాత నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడుతున్న కేసీఆర్ తీరుపై ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క మాట అంటే మాట అన్న‌ది లేదు. కేసీఆర్‌.. నీ పంచాయితీ బాబుతో అయితే బాబును నేరుగా తిట్టేయ్‌.. అంతేకానీ ఆ పేరుతో ఆంధ్రోళ్ల‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా అంటే ఊరుకునేది లేద‌న్న మాట చెప్పింది లేదు.

ప‌క్క‌నోడ్ని క‌దా అంటున్న‌ది.. న‌న్ను కాదు క‌దా?  అనుకొని నిర్ల‌క్ష్యంగా వదిలేస్తే.. చివ‌ర‌కు త‌న‌పైనా దాడి జ‌రుగుతుంద‌న్న స‌త్యాన్ని జ‌గ‌న్ మ‌ర్చిపోయిన‌ట్లున్నారు. బాబును తిట్టేస్తున్నాన్న క‌ల‌ర్ ఇస్తూ.. తెలివిగా ఆంధ్రోళ్ల‌పై విప‌రీత వ్యాఖ్య‌లు చేయ‌టం ద్వారా సెంటిమెంట్‌ను రాజేసే య‌త్నం చేస్తున్న కేసీఆర్ తీరును మొద‌ట్లోనే నియంత్రించాల్సి ఉంది.

కానీ.. ఏపీ విప‌క్ష నేత తెలివితక్కువత‌నం పుణ్య‌మా అని అలాంటి ప‌రిస్థితి లేదు. ఏపీకి ఇవ్వాల్సిన హోదా ఇష్యూలో  మోడీ హ్యాండ్ ఇచ్చినా ఇప్ప‌టివ‌ర‌కూ ఘాటు వ్యాఖ్య చేయ‌ని జ‌గ‌న్ కు.. త‌న స్వార్థ రాజ‌కీయాల‌కు త‌గ్గ‌ట్లే ఇప్పుడు ఆయ‌న తీవ్ర‌మైన మాట‌ను కేసీఆర్ నోటి నుంచి ప‌డాల్సిన ప‌రిస్థితి.

తాజాగా వ‌న‌ప‌ర్తిలో చేసిన ప్ర‌సంగంలో అంద‌రిని దునుమాడేస్తున్న కేసీఆర్‌.. ప‌నిలో ప‌నిగా దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని ఉద్దేశించి దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అనే దుర్మార్గుడు పోతిరెడ్డి పాడుకు పొక్క కొట్టి.. ఇక్క‌డి మ‌న క‌ల్వ‌కుర్తి.. నెట్టెంపాడు.. బీమాల‌ను పెండింగ్ పెట్టి పాల‌మూరు ఎండ‌బెట్టి.. మ‌న‌ల్ని వ‌ల‌స‌బెట్టి.. 64 వేల క్యూసెక్కుల కాలువ త‌వ్వుక‌పోయిండ‌ని మండిప‌డ్డారు. ఆ విష‌యంలో సిగ్గుప‌డాలె.. దుఃఖం వ‌స్త‌ది.. బాధయిత‌దన్న కేసీఆర్‌.. ఈ అంశంపై మ‌రిన్ని వ్యాఖ్య‌లు చేశారు.

సిగ్గులేని చిన్నారెడ్డి పోతిరెడ్డిపాడు త‌వ్వుడు క‌రెక్టే.. పోతిరెడ్డిపాడుతో తెలంగాణ‌కు న‌ష్టం లేదంటూ పేప‌న్లో వ్యాసాలు రాసిండు.. సిగ్గు లేకుండా కుక్క బొక్కేసిన‌ట్లుగా ఒక మంత్రి ప‌ద‌వి కోసం తోకలా ఊపి స‌మైక్య పాల‌న‌ను స‌మ‌ర్థించిన‌ట్లుగా మండిపడ్డారు. త‌న తండ్రి మీద ట‌న్నుల ట‌న్నుల ప్రేమ ఉన్న‌ట్లు చెప్పే వైఎస్ జ‌గ‌న్‌.. భారీ బ‌హిరంగ స‌భ‌లో త‌న తండ్రిని ఉద్దేశించి అంత దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేస్తే.. ఇప్ప‌టివ‌ర‌కూ ఆ వ్యాఖ్య‌ల‌పై రియాక్ట్ కాని వైనాన్ని ఏమ‌నాలి? అన్న ప్ర‌శ్న ప‌లువురి నోటి నుంచి వినిపిస్తోంది.  ఎంత కేసీఆర్‌తో సీక్రెట్ దోస్తానా ఉంటే మాత్రం.. తండ్రిని ఉద్దేశించి అంత మాట అన్నాక జ‌గ‌న్ ఊరుకోవటం ఏమిటి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English