ఓసేయ్ రాముల‌మ్మ సినిమాలో రామిరెడ్డి.. కేసీఆర్

ఓసేయ్ రాముల‌మ్మ సినిమాలో రామిరెడ్డి.. కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమ‌ర్శ‌ల వేడి అంత‌కంత‌కూ పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైన‌ర్ గా గుర్తింపు పొందిన విజ‌య‌శాంతి తాజాగా కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగానే కాదు.. అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ మ‌రే రాజ‌కీయ నేత అన‌ని రీతిలో.. స‌రికొత్త‌గా విమ‌ర్శ‌లు షురూ చేయ‌టం ద్వారా భారీ స‌వాల్‌నే విసిరార‌ని చెప్పాలి.

ఓవైపు అన్నా అంటూనే.. మ‌రోవైపు దొర అన‌టం ద్వారా విజ‌య‌శాంతి త‌న మాట‌ల్లో విల‌క్ష‌ణ‌త‌ను ప్ర‌ద‌ర్శించార‌ని చెప్పాలి. ప్ర‌జ‌ల్ని కాస్త ప‌ట్టించుకోండి దొరా అంటూనే.. నాలుగున్న‌రేళ్ల పాటు ప్ర‌గ‌తిభ‌వ‌న్ లోనూ.. ఫామ్ హౌస్ లోనూ కూర్చున్నావంటూ ఎద్దేవా చేశారు.

ఓసేయ్ రాముల‌మ్మ సినిమాను త‌ల‌పించేలా రాష్ట్రంలో కేసీఆర్ పాల‌న సాగుతోంద‌న్న విజ‌య‌శాంతి.. గురువారం జోగులాంబ గ‌ద్వాల‌.. అలంపూర్ లో ప్రారంభించిన కాంగ్రెస్ స‌భ‌ల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

రాముల‌మ్మ సినిమాలో దొర‌ల‌తో ఎన్ని క‌ష్టాలు ప‌డ్డానో తెలుసు క‌దా.. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో దొర‌ల పాల‌న.. అవే క‌ష్టాలు ఎదుర‌వుతున్న‌ట్లు ఆమె మండిప‌డ్డారు. రాముల‌మ్మ సినిమాలో రామిరెడ్డి ఉంటే.. ఇక్క‌డ కేసీఆర్ ఉన్నార‌న్న ఆమె.. ఉద్య‌మంలో తాను చూసిన కేసీఆర్ వేరు.. ఇప్ప‌టికే కేసీఆర్ వేర‌న్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాల‌న‌ను ఎవ‌రు విమ‌ర్శించినా వారిపై అక్ర‌మ కేసులు పెట్టి వేధింపుల‌కు గురి చేస్తున్నార‌న్నారు.  ఇలాంటి ప‌రిస్థితి కోస‌మే తెలంగాణ కోసం ఉద్య‌మాలు చేశామా? అని ప్ర‌శ్నించారు. నా చెల్లివి.. నిన్ను క‌డుపులో పెట్టుకొని చూసుకుంటాన‌ని చెప్పిన కేసీఆర్‌.. త‌న‌ను దారుణంగా మోసగించార‌న్నారు. త‌న‌నే మోసం చేసిన‌ప్పుడు ప్ర‌జ‌ల్ని మోసం చేయ‌రా? అని ప్ర‌శ్నించారు.

కేసీఆర్ కుటుంబంలోని ఆ న‌లుగురు రాష్ట్రంలోని డ‌బ్బును దోచుకుతింటున్నార‌ని ఆరోపించారు. కేసీఆర్‌.. కేటీఆర్‌..క‌విత‌.. హ‌రీశ్ రావులు తెలంగాణ‌కు చార్ మినార్ లు కార‌ని..  చోర్ మినార్ లుగా మండిప‌డ్డారు. త‌న‌ను తెలంగాణ ముఖ్య‌మంత్రిని చేస్తే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తాన‌ని కేసీఆర్ కోరాన‌ని.. అందుకు సోనియాగాంధీ ఒప్పుకోలేద‌న్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English