నాయకులారా... ఏమిటీ భాష!!!

నాయకులారా... ఏమిటీ భాష!!!

ఎన్నికలంటే హుందాతనం. ఎన్నికలంటే గౌరవం. ఎన్నికలంటే మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం. ఇదంతా గతం. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. మాట్లాడానికే కాదు వినడానికి కూడా ఇబ్బంది పడే భాషని మన రాజకీయ నాయకులు వాడుతున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల హోరు పెరిగింది. అటు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, ఇటు మహాకూటమి పోటీపోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో ప్రతి జిల్లాలోనూ సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సభలకు జనాలు కూడా విపరీతంగానే వస్తున్నారు. అలా వస్తున్న జనాలను చూసి రెచ్చిపోతున్నారో... లేక పాత వివాదాలో కాని మొత్తానికి తెలంగాణలో రాజకీయ నాయకులు మాత్రం వినడానికి వీలు లేని భాషను వాడుతున్నారు.

గతంలో ఆయన అనే పదాన్ని వాడిన రాజకీయ నాయకులు ఇప్పుడు ఏక వచనంతో సంభోదించడం పరిసాటిగా మారిపోయింది. కొన్ని రాజకీయ పార్టీల నాయకులైతే తిట్ల దండకాలే ఎత్తుకుంటున్నారు.దీనిపై రాజకీయ వర్గాల్లోనే కాక ప్రజల్లో కూడా రాజకీయాలు, రాజకీయ పార్టీల నాయకుల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. " రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయి.రాజకీయాల్లో తిట్లు. బూతులు ఎక్కువవుతున్నాయి.ఇది మంచి పరిణామం కాదు " అని రాజకీయ విశ్లేషకుడొకరు వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రజల్ని తన ప్రసంగాల ద్వారా ఉత్తేజితులను చేయడంలో దిట్ట. ఆయన తన ప్రసంగాలలో చెప్పే పిట్ట కథల కోసం ప్రజలు ఎగబడే వారు. అయితే ఆయన తాజా ప్రసంగాలు మాత్రం పాత ప్రసంగాలకు భిన్నంగా ఉంటున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక కాంగ్రెస్ పార్టీలో కె.చంద్రశేఖర రావుకు దీటుగా మాట్లాడే వారు తక్కువ మందే ఉన్నారు. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి తన ప్రసంగాలలో వాడిని, వేడిని పెంచారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తన ప్రసంగాలలో కూడా వేడిని పెంచుతున్నారు.

ఈ ప్రసంగాలలో తిట్ల దండకాలు ఎక్కువవుతున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. "ఈ తిట్ల దండకాల వల్ల ఓట్లు వస్తాయని నమ్మకం లేదు.పైగా ప్రజల్లో చులకన భావం పెరిగి వీళ్లా మన నాయకులు అని కూడా భావిస్తారు "  అని సీనియర్ జర్నలిస్టు ఒకరు వ్యాఖ్యానించారు. తెలంగాణలో జరుగుతున్న ఈ మాటల యుద్ధం రోజురోజుకు పెరుగుతూ పోతే ప్రజలలో రాజకీయాల పట్ల వ్యతిరేకత రావడం ఖాయం అని ఆయన అన్నారు. ముందస్తు ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాత ఈ మాటల తూటాలు మరింత పెరుగుతాయా అని ప్రజలు అనుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English