‘గాలి’కి మ‌ళ్లీ ఎదురుగాలి

‘గాలి’కి మ‌ళ్లీ ఎదురుగాలి

క‌ర్ణాట‌క‌లో మాజీ మంత్రి గాలి జ‌నార్ధ‌న్ రెడ్డికి మ‌ళ్లీ ఎదురుగాలి మొద‌లైన‌ట్లే క‌నిపిస్తోంది. గ‌నుల అక్ర‌మ త‌వ్వ‌కం కేసులతో ఉక్కిరిబిక్కిర‌వుతున్న ఆయ‌న‌కు స్థానిక లోకాయుక్త స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీం(సిట్‌) తాజాగా షాకిచ్చింది. ఇనుప ఖనిజం అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై శ్రీ మినరల్స్‌ కంపెనీ యజమాని బి.వి.శ్రీనివాసరెడ్డిని బుధవారం అరెస్టు చేసింది. శ్రీ‌నివాస రెడ్డి.. గాలి జ‌నార్ధ‌న్ రెడ్డిక అత్యంత స‌న్నిహితుడు. బళ్లారి జిల్లా సండూరు తాలూకా సిద్ధాపుర గ్రామంలో 2009 జులై నుంచి డిసెంబరు వరకు 1,38,383 మెట్రిక్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని తవ్వి.. అక్రమంగా రవాణా చేశార‌ని ఆయ‌న‌పై సిట్ ఆరోప‌ణ‌లు మోపింది. శ్రీ‌నివాస రెడ్డి అరెస్టు నేప‌థ్యంలో గాలి చుట్టూ మ‌ళ్లీ బిగుస్తున్న‌ట్లేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. గాలి కంపెనీలతో శ్రీ‌నివాస రెడ్డి సంస్థ‌ల‌కు చాలా సంబంధాలున్నాయ‌ని వారు చెబుతున్నారు.

మ‌రోవైపు, ఇనుప ఖ‌నిజం అక్ర‌మ ర‌వాణా ఆరోప‌ణ‌ల మీదే ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. బెళెకేరి ఓడరేవులో నిల్వ చేసిన ముడి ఇనుప ఖనిజాన్ని విదేశాలకు ఎగుమతి చేసిన ఆరోపణలపై త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందిగా బళ్లారి రూర‌ల్ ఎమ్మెల్యే బి.నాగేంద్ర, విజయనగర(హొసపేటె) శాసనసభ్యుడు ఆనంద్‌సింగ్‌లకు నోటీసులు పంపించారు. వాస్త‌వానికి బుధ‌వార‌మే వీరిద్ద‌రూ విచార‌ణ‌కు హాజ‌రు కావాలి. కానీ వెళ్ల‌లేదు. దీంతో గురువారం త‌ప్ప‌కుండా త‌మ ముందుకు రావాల‌ని.. లేని ప‌క్షంలో చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మిస్తామ‌ని వారికి సిట్ అధికారులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English