సీఎం సొంత ఇలాకాలో టీఆర్ఎస్ కు షాక్‌!

సీఎం సొంత ఇలాకాలో టీఆర్ఎస్ కు షాక్‌!

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల వేడి ఊపందుకున్న నేప‌థ్యంలో మిగ‌తా పార్టీల నాయ‌కుల‌ను టీఆర్ ఎస్ లోకి లాగేందుకు ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్....ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అదే విధంగా టీఆర్ ఎస్ లో సీటు ద‌క్కని కొంద‌రు అసంతృప్త నేత‌లు....వేరే పార్టీల‌లోకి జంప్ అవుతున్నారు.

అయితే, తాజాగా కేసీఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌కు షాక్ త‌గిలింది. గులాబీ ద‌ళ అధినేత సొంత నియోజ‌క‌వ‌ర్గం గ‌జ్వేల్ టీఆర్ఎస్ కు చెందిన కీల‌క‌మైన‌ నేతలు, వారి అనుచరులు కాంగ్రెస్ లో చేరారు. జగదేవ్‌పూర్‌ ఎంపీపీ రేణుకతోపాటు ఇద్దరు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచ్‌లు, ఇద్దరు కౌన్సిలర్లు బుధవారం నాడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో, ముంద‌స్తుకు ముందు టీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిన‌ట్ల‌యింది.

2014 ఎన్నిక‌ల్లో ఆప‌ద్ధ‌ర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. మ‌రోసారి అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అందులోనూ, తెలంగాణ రాజ‌కీయాల‌కు ప‌వ‌ర్ హౌస్ వంటి కేసీఆర్ ఫార్మ్ హౌస్ ఉన్న జగదేవపూర్ లో టీఆర్ ఎస్ కు మంచి ప‌ట్టుంది.


అటువంటి నేప‌థ్యంలో తాజాగా రేణుక తో పాటు ఎంపీటీసీలు మమతాభాను, కవితా యాదగిరి, కౌన్సిలర్‌ భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకోవ‌డంతో కేసీఆర్ కు గ‌ట్టి షాక్ త‌గిలిన‌ట్ల‌యింది. తాజా చేరిక‌ల‌పై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. గజ్వేల్‌లో కాంగ్రెస్ జెండా రెప‌రెప‌లాడుతుంద‌ని ఉత్త‌మ్ ధీమా వ్యక్తం చేశారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English