క‌లిసి వెళ‌దామంటే నో చెప్పి..

క‌లిసి వెళ‌దామంటే నో చెప్పి..

ఎప్పుడూ ఎవ‌రిని అండ‌ర్ ఎస్టిమేట్ చేయ‌కు అంటూ అప్పుడెప్పుడో వ‌చ్చిన వ‌ర్మ సినిమాలో డైలాగ్ చ‌ప్పున గుర్తుకు వ‌చ్చింది తాజాగా కేసీఆర్ వీరావేశం చూసిన త‌ర్వాత‌. నిజామాబాద్‌లో టీఆర్ఎస్ నిర్వ‌హించిన తాజా స‌భ‌లో చంద్ర‌బాబు మీదా..తెలంగాణ‌లో ఏర్ప‌డిన కూట‌మి మీదా కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఎందుకిలా? అంటూ.. కేసీఆర్ చేసిన త‌ప్పులే ఇప్పుడు ఆయ‌న‌లో ఆవేశాన్ని అంత‌కంత‌కూ పెంచేలా చేస్తున్నాయి.

విభ‌జ‌న త‌ర్వాత మారిన రాజ‌కీయ నేప‌థ్యంలో కేసీఆర్ తో స్నేహ హ‌స్తాన్ని అందించారు చంద్ర‌బాబు. విడిపోయిన క‌లిసి ఉందామ‌న్న నినాదానికి త‌గ్గ‌ట్లే ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి ఉంది. 42 ఎంపీలు ఉన్న తెలుగు ప్రాంతం రెండుగా ముక్క‌లైన త‌ర్వాత‌.. ఈ రెండు ప్రాంతాల ముఖ్యమంత్రులు ఒకే మాట మీద ఉంటే.. తెలుగోళ్ల ప్ర‌యోజ‌నాల‌కు న‌ష్టం వాటిల్ల‌కుండా ఉంటుంది.

ఇదే ఉద్దేశంతో అన‌వ‌స‌ర రాజ‌కీయ ఉద్రిక్త‌త‌ల‌కు తావివ్వ‌కుండా ఉండేందుకు కొద్ది నెల‌ల క్రిత‌మే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చంద్రబాబు ఒక ప్ర‌తిపాద‌న చేశారు. ప‌రిమిత స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసేందుకు వీలుగా రెండు పార్టీలు క‌లిసి ఎన్నిక‌లకు వెళ‌దామ‌న్నారు. దీని కార‌ణంగా రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య స‌హృద్బావ వాతావ‌ర‌ణంతో పాటు.. అన‌వ‌స‌ర‌మైన రాజ‌కీయ అల‌జ‌డుల‌కు దూరంగా ఉండే వీలు ఉంటుంద‌న్నారు.

కానీ.. బాబు చేసిన ప్ర‌తిపాద‌న‌కు నో చెప్పేశారు కేసీఆర్‌. తెలంగాణ‌లో ఉనికి కోసం కిందా మీదా ప‌డుతున్న బాబుకు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని.. తాను నో చెబితే.. కాంగ్రెస్ తో జ‌త క‌ట్టే అవ‌కాశం బాబుకు లేద‌న్న అంచ‌నాతో కేసీఆర్ కాద‌న్నారు. త‌ర్వాత చోటు చేసుకున్న‌ ప‌రిణామాల నేప‌థ్యంలో కాంగ్రెస్‌.. టీజేఎస్.. సీపీఐల‌తో క‌లిసి పొత్తుకు దిగేలా మ‌హాకూట‌మికి అంకురార్ప‌ణ జ‌రిగింది.

ఈ ప‌రిణామాన్ని ఊహించ‌ని కేసీఆర్ కు.. కూట‌మి ఏర్పాటు ఆగ్ర‌హానికి గురి చేసింది. త‌న గెలుపును ప్ర‌భావితం చేసే అవ‌కాశం కూటమికి ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించే కేసీఆర్‌.. భావోద్వేగ వ్యాఖ్య‌ల‌కు దిగార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాను టీఆర్ఎస్ కు వ్య‌తిరేకం ఎంత మాత్రం కాద‌ని.. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌యోజ‌నాల కోసం క‌లిసి పోటీకి వెళ‌దామ‌ని ప్ర‌తిపాదించిన‌ప్ప‌టికీ నో చెప్పి.. ఈ రోజు కూట‌మి ఏర్ప‌డిన త‌ర్వాత ఆగ‌మాగం కావ‌టంలో అర్థం ఉందా  కేసీఆర్  అన్న క్వ‌శ్చ‌న్ ప‌లువురి నోట వినిపిస్తోంది. నిజామాబాద్ స‌భ‌లో బాబుపై తీవ్ర‌స్థాయిలో కేసీఆర్ విరుచుకుప‌డిన వైనాన్ని చూసిన ప‌లువురు.. క‌లుస్తామంటే మితిమీరిన ఆత్మ‌విశ్వాసంతో నో చెప్పి.. త‌న నిర్ణ‌యంతో కూట‌మి ఆవిర్భావానికి కార‌ణ‌మైన కేసీఆర్‌.. ఇప్పుడు కేక‌లు పెట్ట‌టంలో అర్థం ఉందా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English