మావోయిస్టుల హిట్‌లిస్టులో 15 మంది

మావోయిస్టుల హిట్‌లిస్టులో 15 మంది

విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఒడిశాల అటవీ ప్రాంతాలు గజగజలాడుతున్నాయి. అటవీ ప్రాంతం కదా...చలి ఎక్కువే అనుకుంటున్నారా.అందుకు కాదు ఏజెన్సీ గ్రామాలు వణికిపోయేది. మావోయిస్టుల వారోత్సవాలు, పోలీసుల కూంబింగ్ తో ఏజెన్సీ పల్లెలు వణికిపోతున్నాయి. రెండు రోజుల క్రితం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సోమ హత్య తర్వాత ఏజెన్సీలో ఎప్పుడు ఏ పరిణామం జరుగుతుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు ప్రజాప్రతినిధులను కాల్చి చంపిన మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో మరో 15 మంది ప్రజా ప్రతినిధులు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారంటున్నారు. మావోయిస్టుల నుంచి ప్రాణ భయం ఉన్న నాయకుల్లో అధికార పార్టీకి చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు, శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలరాజుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కిడారి హత్యపై ప్రభుత్వం సిట్ విచారణ చేపట్టింది. ఏజెన్సీలోని ప్రజా ప్రతినిధులు జాగ్రత్త‌లు తీసుకోవాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

మావోయిస్టులు గత కొంతకాలంగా విశాఖ, ఏవోబీ బోర్డర్‌లో ఎటువంటి కార్యకలాపాలు చేపట్టడం లేదు. దీంతో ఇక్కడి నుంచి మావోయిస్టులు వెళ్లిపోయారని, ఇక ఏం ఫరవాలేదని పోలీసులు, ప్రజాప్రతినిధులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే హఠాత్తుగా మావోయిస్టులు విరుచుకుపడి ఇద్దరు ప్రజాప్రతినిధులను హతమార్చడంతో వారి ఉనికి మరోసారి బయటపడింది.  కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు చింతపల్లి బాలరాజును మావోయిస్టులు కిడ్నాపు చేశారు. అప్పడే ఎలాంటి ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

అప్పటి నుంచి బాలరాజు తన స్వగ్రామంలో కంటే విశాఖపట్నంలోనే ఎక్కువగా ఉంటున్నారు. ఇక అయ్యన్న పాత్రుడు కూడా గతంలో కూడా మావోయిస్టుల హిట్‌లిస్టులోనే ఉన్నారు. ఆయనకు కూడా మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇక గిడ్డి ఈశ్వరి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును కాల్చడానికి ముందు మవోయిస్టులు పార్టీ మారేందుకు అధికార పార్టీలోకి మారేందుకు ఎంత తీసుకున్నావు అంటూ ప్రశ్నించారని వార్తలు వచ్చాయి. అంటే డబ్బులు తీసుకుని పార్టీ ఫిరాయింపులు చేసిన వారిపై మావోయిస్టులు గుర్రుగా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు తమ దర్యాప్తు జరుపుతున్నారంటున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల కదలికలు మళ్లీ ప్రారంభమైనట్లేనని రాజకీయ వర్గాలు, పరిశీలకులు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English