మాస్ రాజా కరుణించాడు

మాస్ రాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని ఎప్పుడో మూడేళ్ల కిందట తొలిసారి వార్తలొచ్చాయి. గత ఏడాది ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ ఏమైందో ఏమో కానీ.. ఈ సినిమా ఎంతకీ పట్టాలెక్కలేదు. కథ విషయంలో ఏమైనా అంగీకారం కుదరలేదా.. వేరే సమస్యలేమైనా ఉన్నాయా తెలియదు కానీ.. ఎంతకీ ఈ సినిమా ముందుకు కదల్లేదు.

సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమకోసమే చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టాక త్రినాథరావు మూడేళ్ల పాటు ఇంకో సినిమా మొదలుపెట్టలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. సమస్యంతా మాస్ రాజా దగ్గరే ఉన్నట్లుగా గుసగుసలు వినిపించాయి. ఒక దశలో ఈ సినిమా ఆగిపోయిందని.. త్రినాథరావు వేరే సినిమా చూసుకుంటున్నాడని కూడా వార్తలొచ్చాయి. కానీ అలాంటిదేమీ కూడా జరగలేదు. రవితేజ ఏమో.. ఒకదాని తర్వాత ఒకటి వేరే సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ‘క్రాక్’ తర్వాత త్రినాథరావు సినిమా చేయాల్సింది కానీ.. ఖిలాడి మొదలుపెట్టాడు. దాని తర్వాతేమో ‘రామారావు’ వచ్చి పడింది. దీంతో త్రినాథరావు సినిమా మీద అనుమానాలు అంతకంతకూ పెరిగిపోయాయి.

ఐతే ఎట్టకేలకు రవితేజ మనసు కరిగినట్లు సమాచారం. త్రినాథరావు సినిమాను అతి త్వరలో మొదలుపెట్టేస్తున్నాడట. అక్టోబరు 1న ఈ చిత్రానికి ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్రినాథరావు ఆస్థాన రచయిత ప్రసన్న కుమార్ బెజవాడనే ఈ చిత్రానికి కూడా స్క్రిప్టు అందించాడు. త్రినాథరావు-ప్రసన్న ఎంటర్టైనర్లకు పెట్టింది పేరు. రవితేజ కూడా వినోదాత్మక చిత్రాల్లో బాగా రాణించగలడు. ఈ కలయికలో మంచి ఎంటర్టైనర్ వస్తుందని ఆశించొచ్చు.