కుమారుడి కోసం జానా తిప్పలు

కుమారుడి కోసం జానా తిప్పలు

జానారెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్ నేత‌. ద‌శాబ్దాల రాజ‌కీయ జీవితంలో ఎన్నో ప‌ద‌వుల‌ను అలంక‌రించారు. మ‌రెన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కొన్నారు.

తాజాగా ఆయ‌న త‌న వార‌సుడి అరంగేట్రానికి రంగం సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. కుమారుడు ర‌ఘువీర్‌తో క‌లిసి జానారెడ్డి డిల్లీలోని పార్టీ పెద్ద‌ల‌ను క‌ల‌వ‌డం ప్ర‌స్తుతం ప‌లు ఊహాగానాల‌కు తెర‌తీసింది.

జానారెడ్డి చాలాకాలంగా నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నిక‌వుతున్నారు. 2014లోనూ అక్క‌డే విజ‌యం సాధించారు. అయితే, సాగ‌ర్‌ తో పాటు ప‌క్క‌నున్న మిర్యాల‌గూడ వంటి మ‌రో రెండు, మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ జానారెడ్డికి మంచి ప‌ట్టు ఉంది.

గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున ఎన్‌.భాస్క‌ర్ రావు మిర్యాలగూడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయ‌న‌ విజ‌యంలో జానా పాత్ర కాద‌న‌లేనిది. నాలుగున్న‌రేళ్లు గ‌డిచేస‌రికి అక్క‌డ ప్ర‌స్తుతం లెక్క‌లు తారుమారయ్యాయి. భాస్క‌ర్‌రావు టీఆర్ఎస్ గూటిలో చేరారు. దీంతో అక్క‌డి నుంచి త‌న వార‌సుడు ర‌ఘువీర్‌ను బ‌రిలోకి దింపాల‌ని జానా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ ప్ర‌ణాళిక‌ల్లో భాగంగానే జానా త‌న కుమారుణ్ని వెంట‌బెట్టుకొని డిల్లీ వెళ్లిన‌ట్లు స‌మాచారం. అయితే, ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అందుబాటులో లేక‌పోవ‌డంతో ఇత‌ర సీనియ‌ర్ నేత‌ల‌తో జానా భేటీ అయిన‌ట్లు తెలిసింది.

మిర్యాల‌గూడ నుంచి పోటీ చేసే అవ‌కాశ ర‌ఘువీర్‌కు క‌ల్పించాల‌ని.. అత‌డి గెలుపు బాధ్య‌త‌ల‌ను తాను చూసుకుంటాన‌ని అధిష్ఠానానికి జానా న‌మ్మ‌కంగా చెప్పిన‌ట్లు స‌మాచారం.

గ‌త ఎన్నిక‌ల్లో భాస్క‌ర్‌రావు మిర్యాల‌గూడ నుంచి విజ‌యం సాధించ‌డంలో త‌న పాత్ర‌ను కూడా డిల్లీ పెద్ద‌ల‌కు జానా వివ‌రించిన‌ట్లు పార్టీవ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. మ‌రి జానా మంత‌నాలు ఫ‌లిస్తాయా? పార్టీ అధిష్ఠానం జానా కుటుంబానికి రెండు టికెట్లు ఇస్తుందా? లేదా? అన్న సంగ‌తులు తేలాలంటే మ‌రికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English