కాంగ్రెస్ లో కమిటీ లొల్లి....

కాంగ్రెస్ లో కమిటీ లొల్లి....

కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల కమిటీల లొల్లి తీవ్రస్ధాయికి చేరింది. నిన్నటి వరకూ అందరూ కలిసి పనిచేస్తామని, తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట సమితిని గద్దె దించడం ఖాయమని చెప్పిన నాయకులు కమిటీల ఏర్పాటు తర్వాత సీన్ మార్చేశారు.

సీనియర్లలో కొందరిని దూరం పెట్టిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో వారికి పెద్ద పీట వేసింది. దీంతో సీనియర్ నాయకులు అధిష్టానంపై గుర్రగా ఉన్నారు. యువరక్తాన్ని ప్రోత్సహించడమంటే సీనియర్లను విస్మరించడం కాదని వారంటున్నారు.

ప్రచార కమిటీ చైర్మన్ పదవిని ఆశించిన పార్టీ సీనియర్లు వి.హనుమంతరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి తమ నిరసనను పార్టీ అగ్ర నాయకత్వం వద్దే ప్రస్తావించినట్లు సమాచారం. బుధవారం నాడు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అధిష్టానం దూత గులాం నబీ అజాద్ ఎదుటే విమర్శించిన వి.హనుమంతరావు గురువారం నాడు తన విమర్శలను మరింత పెంచారు.

తనను చెంచల్ గుడా జైలుకు పంపినా తాను బాధ పడే వాడిని కాదని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇక మరో సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి అయితే తెలంగాణ ఇన్‌చార్జి కుంతియా పార్టీకి శనిలా దాపరించారంటూ మండిపడ్డారు. ఆయన తీరుతోనే పార్టీ భ్రష్టు పట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరో సీనియర్ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి తనకు అవకాశం రాకపోవడం కంటే రేవంత్ రెడ్డికి మంచి పదవి ఇవ్వడంపై గుర్రుగా ఉన్నారు. ఆయన కూడా ప్రచార కమిటీ చైర్మన్ పదవిని ఆశించి భంగపడ్డారు. ఇక కీలకమైన టిక్కట్ల పంపిణీ వ్యవహారాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికే ఇవ్వడంతో పార్టీలో సీనియర్లు చాలా గుర్రుగా ఉన్నారు.

ఆయనతో పాటు కమిటీలో చాలా మంది సీనియర్లు ఉన్నా చివరి నిర్ణయం మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డిదే కాబట్టి ఈ సారి తమ అనుచరులకు టిక్కట్లు దక్కుతాయో...లేదో అని సీనియర్లు ఆందోళనగా ఉన్నారు. దీని ప్రభావం రేపు ఎన్నికలపై పడుతుందని వారంటున్నారు. మహాకూటమి పేరుతో మిగిలిన పార్టీలతో చేతులు కలిపితే తమ స్ధానాలు పొత్తులో గల్లంతు అయ్యే అవకాశం ఉందని కంగారు పడుతున్నారు. అధిష్టానం తమకు అన్ని అధికారాలు ఇచ్చిందనే సాకుతో తమకు కేటాయించిన స్ధానాలను పొత్తులో భాగంగా ఇతర పార్టీలకు వదిలేసే అవకాశం ఉందని వారంటున్నారు.

మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో కమిటీల గోల ఎన్నికల నాటికి ముదిరి పాకాన పడి ఎక్కడ విజయావకాశాలు దెబ్బతీస్తుందో అని పార్టీలోని ఇతర నాయకులు ఆందోళన చెందుతున్నారు.  జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి సాధారణమేనని, వీటికి భయపడాల్సిన పని లేదని మరికొందరు అంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ రాజకీయం రసకందాయంలో పడుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English