మ‌చ్చ లేని మా మంచి మోడీ...

మ‌చ్చ లేని మా మంచి మోడీ...

మ‌చ్చ లేని మా మంచి మోడీ అంటూ అదే ప‌నిగా కీర్త‌న‌లు ఆల‌పిస్తున్న క‌మ‌ల‌నాథుల‌కు క‌రెంట్ షాక్ కొట్టిన‌ట్లుగా రాఫెల్ ఉదంతం ఒక‌టి తెర మీద‌కు వ‌చ్చింది. ఏదో ఆషామాషీ తేలిపోయే వ్య‌వ‌హారం కాద‌న్న విష‌యం రోజులు గ‌డుస్తున్న కొద్దీ స్ప‌ష్ట‌మ‌వుతోంది. రాఫెల్ లో ఏదో జ‌రిగింద‌న్న సందేహం కాస్తా ఇప్పుడు రాఫెల్ లో ఖాయంగా జర‌గ‌రానిది జ‌రిగిపోయింద‌న్న మాట బ‌లంగా వినిపిస్తున్న ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విష‌యంలో ర‌క్ష‌ణ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై హెచ్ సీఎల్ అదేనండి.. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మాజీ అధినేత సువ‌ర్ణ‌రాజు త‌ప్పు ప‌ట్ట‌ట‌మే కాదు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

రాఫెల్ యుద్ధ విమానాల్ని త‌యారుచేసే సామ‌ర్థ్యం హెచ్ సీఎల్‌కు లేదంటూ నిర్మ‌ల‌మ్మ మాట‌ను సింఫుల్ గా కొట్టిపారేస్తూ.. మోడీ స‌ర్కారు ఇరుకున ప‌డేలా మాట్లాడారు. కేంద్రం ఫ్రెంచి కంపెనీ ద‌సాల్ట్ తో తొలుత ప్రారంభించిన డీల్ కానీ ఓకే చేసి ఉంటే.. 126 యుద్ధ విమానాలను తాము భార‌త్‌లోనే త‌యారు చేసి ఉండేవాళ్ల‌మ‌న్నారు. ద‌సాల్ట్ కంపెనీతో నాడు ఒక వ‌ర్క్ షేర్ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్న‌ట్లుగా వెల్ల‌డించారు.

తాను చెప్పిన వివ‌రాల‌న్నీ ఫైళ్ల‌ల్లో ఉన్నాయ‌ని.. వాటిని కానీ బ‌య‌ట పెడితే అస‌లు నిజాలు ఇట్టే బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని చెప్పారు. ఇందులో భాగంగా హెచ్ సీఎల్ ఫైళ్ల‌ను కేంద్రం బ‌య‌ట పెట్టాల‌ని డిమాండ్ చేశారు. హెచ్ సీఎల్ ఛైర్మ‌న్ గా ఈ నెల ఒక‌టిన ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌ర్వాత ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన కీల‌క వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. రాఫెల్ యుద్ధ విమానాల్ని దేశీయంగా త‌యారు చేసే సామ‌ర్థ్యం త‌మ‌కు ఉంద‌న్న మాట‌ను హెచ్ సీఎల్ లో అత్యున్న‌త స్థాయి హోదాలో ప‌ని చేసిన వ్య‌క్తి చెప్ప‌టం ఇదే తొలిసారిగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ద‌సాల్ట్ తో గ‌తంలో తాము గ‌తంలో రూపొందించిన మిరేజ్ -2000 ర‌కం యుద్ధ విమానాల్ని గ‌డిచిన ఇర‌వైఏళ్లుగా తాము నిర్వ‌హిస్తున్నామ‌ని.. 25 ట‌న్నుల బ‌రువు ఉండే నాలుగో శ్రేణి సుఖోయ్ -30 ర‌కం యుద్ధ విమానాల్ని ముడి స‌రుకు నుంచి త‌యారు చేసే సత్తా ఉన్న‌ప్పుడు రాఫెల్ తాము త‌యారు చేయ‌లేమా? అంటూ ప్ర‌శ్నిస్తున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగానే కాదు.. ప‌లు సందేహాల‌కు తావిచ్చేలా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. హెచ్ సీఎల్ కు తాను ఐదేళ్లుగా సార‌థిగా ఉన్నాన‌ని.. త‌మ‌కు కానీ ఛాన్స్ ఇచ్చి ఉంటే అన్ని అంశాల్ని తాము ప‌రిష్క‌రించి ఉండేవాళ్లమ‌న్న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. హెచ్ సీఎల్ మాజీ చీఫ్ నోరు విప్పిన తాజా వ్యాఖ్య‌లు రానున్న రోజుల్లో రాఫెల్ ఇష్యూను మ‌రింత వివాదంగా మారుస్తాయ‌న‌టంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English