ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తులు

ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తులు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన కీల‌క వార్త ఒక‌టి తెర‌మీద‌కు వ‌చ్చింది. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) మోడీ ఆస్తుల‌ను వెల్లడించింది.

మోడీజీకి రూ. 2 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు పేర్కొంటూ ఆయనకు సొంత కారుగానీ, ద్విచక్రవాహనంగానీ, ఎటువంటి అప్పులుగానీ లేవని తెలిపింది. ప్రధాని వద్ద రూ.48,944 నగదు అందుబాటులో ఉండగా.. దాదాపు రూ.కోటికి పైగా నగదు బ్యాంకుల్లో ఉంది.

వీటిలో గాంధీనగర్‌లోని ఒక ఎస్బీఐ ఖాతాలో రూ.11.29 లక్షలు, మరో ఎస్బీఐ ఖాతాలో రూ.1.07 కోట్లు ఉన్నాయి. రూ.20 వేల విలువైన ఎల్అండ్‌టీ ఇన్‌ఫ్రా బాండు, రూ.5.18 లక్షల విలువైన జాతీయ పొదుపు పత్రం, రూ.1.59 లక్షల విలువైన బీమా పాలసీ ఉన్నాయి. రూ.1.38 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి.

స్వచ్ఛంద ఆస్తుల వెల్లడిలో భాగంగా మార్చి 31, 2018 వరకు ఉన్న వివరాలను పీఎంవో విడుదల చేసింది. గాంధీనగర్‌లోని ఓ నివాస గృహంలో నాలుగో వంతు వాటా మోడీ పేరుపై ఉంది. 2002లో రూ.1.30 లక్షలకు దీన్ని కొనుగోలు చేసిన ఆయన.. దానిపై రూ.2.47 లక్షలు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం దాని విలువ దాదాపు రూ.కోటి వరకు ఉంది.

ప్రధానికి అప్పులుగానీ, కార్లుగానీ, ద్విచక్రవాహనాలుగానీ లేవని పీఎంవో వెల్లడించింది. కిందిస్థాయి ప్రజాప్రతినిధులే కోట్లకు పడగలెత్తుతున్న ఈ రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తుల విలువ కేవలం రూ.2.28 కోట్లు మాత్రమే కావడం విశేషమే. కాగా, సొంత కారు లేక‌పోవ‌డం వ‌ల్లే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల విష‌యంలో మోడీజీ సామాన్యుల ఆక్రంధ‌న‌లు ప‌ట్టించుకోవ‌డం లేదంటూ ప‌లువురు నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English