ధిక్క‌రిస్తే.. టికెట్లు రావ‌న్న కేటీఆర్!

ధిక్క‌రిస్తే.. టికెట్లు రావ‌న్న కేటీఆర్!

పార్టీలో తిరుగులేద‌ని.. అధినేత కేసీఆర్ మాట‌కు ఎదురు చెప్పే ద‌మ్ము. . ధైర్యం ఉన్న నేత‌లంటూ ఎవ‌రూ లేర‌న్న మాట త‌ర‌చూ వినిపిస్తూ ఉంటుంది. మ‌రికొంద‌రైతే.. ఒక అడుగు ముందుకు వేసి.. కేసీఆర్ మాట‌కు ఎదురు చెప్ప‌టం పార్టీలోనే కాదు.. తెలంగాణ రాష్ట్రంలోనే ఎవ‌రూ లేర‌న్న మాట‌ను చెబుతుంటారు.

మ‌రింత తిరుగులేని కేసీఆర్ కు.. తాను ప్ర‌క‌టించిన 105 మంది అభ్య‌ర్థుల విష‌యంలో చాలాచోట్ల వ్య‌తిరేక‌త ఎందుకు వ్య‌క్త‌మ‌వుతోంది. నిర‌స‌న‌లు.. ఆందోళ‌న‌లు.. ఆత్మ‌హ‌త్యాయ‌త్నాలు ఎందుకు? అన్న ప్ర‌శ్న‌ను వేసుకుంటే.. కేసీఆర్ అస‌లు బ‌లం ఏమిటో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ఇదిలా ఉంటే.. ఊహించ‌ని రీతిలో కేసీఆర్ డిసైడ్ చేసిన అభ్య‌ర్థుల విష‌యంలో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. పార్టీ అధినాయ‌క‌త్వంలో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్లు చెబుతున్నారు. పార్టీ అభ్య‌ర్థుల‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారిని బుజ్జ‌గించ‌టానికి.. వారిని త‌మ దారిలోకి తెచ్చుకోవ‌టానికి తాజా మాజీ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

వాస్త‌వానికి ఇలాంటి ప‌నులు కేసీఆర్ చేయాల్సి ఉన్నా.. అందుకు భిన్నంగా కేటీఆర్ తెర మీద‌కు రావ‌టం గ‌మ‌నార్హం. పార్టీ నిర్ణ‌యాన్ని ధిక్క‌రిస్తూ నేత‌లు చేస్తున్న ప‌నుల విష‌యంలో కేటీఆర్ తాజాగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను ఉల్లంఘించిన వారికి టికెట్లు ద‌క్కే అవ‌కాశం లేద‌ని తేల్చేశారు. రెండో ద‌శ‌లో మ‌రో 14 మంది అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించాల్సి ఉన్న నేప‌థ్యంలో.. టికెట్ల కోసం ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం చేశారు.

ఇందులో భాగంగా పోటాపోటీగా చేస్తున్న బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో విసిగిపోయిన కేటీఆర్‌.. తాజాగా పార్టీ నేత‌ల‌కు వార్నింగ్ ఇచ్చేశార‌ని చెబుతున్నారు. పార్టీకి క్ర‌మ‌శిక్ష‌ణే ప్రాణ‌మ‌ని.. అన్ని విధాలుగా స‌మ‌ర్థులైన అభ్య‌ర్థుల‌కే అవ‌కాశం ల‌భిస్తుంద‌ని.. అలాంటి వారినే ఎంపిక చేస్తామ‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.

వ‌రంగ‌ల్ తూర్పు మాత్ర‌మే కాదు.. మ‌రే స్థానానికి సంబంధించైనా స‌రే.. క్ర‌మ‌శిక్ష‌ణ పాటించే వారికే టికెట్ల‌ను అధిష్ఠానం ఇస్తుంది త‌ప్పించి.. మ‌రేమీ ప్రాతిప‌దిక కాద‌ని పేర్కొన్నారు.  పార్టీని వీడే ఉద్దేశంతో బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు చేసిన వారి అవ‌స‌రం పార్టీకి లేద‌ని.. అలాంటి వారికి టికెట్లు ఇచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేయ‌టం చూస్తే.. ఇవ‌న్నీ ఆయ‌న ఏ ప్రాతిపదిక‌న చేస్తున్నార‌న్న‌ది ప్ర‌శ్న‌.

కేసీఆర్ నోటి నుంచి రావాల్సిన ఇలాంటి మాట‌లు కేటీఆర్ నోటి నుంచి రావ‌టం అంటే.. పార్టీ అప్ర‌క‌టిత అధ్య‌క్షుడిగా కేటీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నారా?  అధికారిక ప‌ట్టాభిషేకానికి ముందే.. పార్టీ ప‌గ్గాల్ని ఆయ‌న చేత‌బ‌ట్టారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.  


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English