ప్ర‌ణ‌య్ హ‌త్య‌పై ప్ర‌ముఖ సింగ‌ర్ సంచ‌ల‌న పోస్ట్‌!

ప్ర‌ణ‌య్ హ‌త్య‌పై ప్ర‌ముఖ సింగ‌ర్ సంచ‌ల‌న పోస్ట్‌!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌ణ‌య్ హ‌త్యపై ప్ర‌ముఖులు స్పందిస్తున్నారు. తాజాగా.. ప్ర‌ముఖ సింగ‌ర్‌.. డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌య శ్రీ‌పాద రియాక్ట్ అయ్యారు. ఈ హ‌త్య‌పై సోష‌ల్ మీడియాలో ఆమె భారీ పోస్ట్ ఒక‌టి పోస్ట్ చేశారు. ఈ హ‌త్యోదంతం ఆమెను ఎంత‌లా క‌దిలించిందో.. ఆమె పోస్ట్‌ను చూస్తే అర్థం చేసుకోవ‌చ్చు.ప్ర‌ణ‌య్ మ‌ర్డ‌ర్ ను త‌మిళ‌నాడులోని  కౌస‌ల్య‌-శంక‌ర్ ల ప‌రువు హ‌త్య‌తో ఆమె పోల్చారు.

ఈ సంద‌ర్భంగా భారీ లేఖ‌ను ఆమె పోస్ట్ గా పెట్టారు. అందులోని ముఖ్యాంశాల్ని చూస్తే..

- భారత్‌లో కులం పేరు చెప్పుకోకుండా ఏ రాజకీయ నాయకుడు, సినీ నటుడు.. ఎవరైనా సరే మనలేరు.  అది వ్యవస్థలో అంతర్భాగమైంది. నగరాల్లో చాలామంది ఇతరుల కులం తెలుసుకోవాలనుకుంటుంటారు.  కులాన్ని అడ్డు పెట్టుకుని పెద్ద పెద్ద కేసుల నుంచి చాలా మంది బయటపడుతున్నారు.

- కులం పేరుతో అణచివేయడమనేది ఈ దేశంలో భయంకరమైన నిజం. పెద్ద కులస్థుల బావిలో నీళ్లు తాగారని బడుగుల పిల్లలను చావగొట్టిన సంఘటనలున్నాయి.  నీళ్లకు, మట్టికి కులం సర్టిఫికేట్ ఇవ్వడంలో భారతీయులు విజయవంతమయ్యారు. ఇలాంటి వాళ్లను మార్చలేమని.. కొంతమంది అంటుంటారు.

- సొంత ఫ్యామిలీలో తల్లిదండ్రులను, అన్నదమ్ములను మార్చలేరు కానీ పక్కవాళ్ల గురించి చెబుతారు. పేరు చివర తోక తీసేయడం మొదట చేయాల్సిన పని. అయితే అదేదో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో పేర్ల చివరన కులాన్ని లేకపోతే మార్పు సాధించినట్టు ఎంత‌మాత్రం కాదు.

- ఈ మార్పు వ్య‌క్తి అంతరాల్లో జ‌ర‌గాలి. అయ్యో అలా చేస్తే మావాళ్లు ఒప్పుకోరు అంటుంటారు.. అలాంటి వాళ్లు మీకు కావాలా వద్దా అనేది మీరు ఆలోచించుకోవాలి. ఒకే కులంలో కూడా ఆర్థిక స్థితిగతులు, అమెరికా వీసా లాంటివి పెళ్లి సంబంధాల్లో ప్రధాన అంశాలయ్యాయి.

- ఈ రోజుల్లో పెళ్లి ఖర్చుల్లో అమ్మాయి, అబ్బాయిలది చెరో సగం అనేవాళ్లు ఎంతమంది ఉన్నారు? పెళ్లి అంటే అమ్మాయిది మాత్రమే అనేలా.. కోట్లలో ఖర్చు చేయించేవారు చాలామంది ఉన్నారు. కుల పిచ్చి అన్ని మతాల్లో ఉంది.   కులాన్ని అంత త్వరగా ఈదేశం నుంచి తీసెయ్యలేం.

- కులాల‌పై పోరాటానికి నాలుగు అంశాల్ని ఫాలో కావాల్సి ఉంది. 1. కులం గురించి అడిగితే తెలీద‌ని చెప్ప‌టం. 2. ఎవ‌రైనా కుల ప్ర‌స్తావ‌న తెస్తే.. వ‌ద్ద‌ని వారించ‌టం. 3. ఎక్కువ‌గా పుస్త‌కాలు చ‌ద‌వ‌టం. సోస‌ల్ మీడియాకు ప‌రిమితం కాకుండా అన్ని ర‌కాల సిద్ధాంతాల్ని అధ్య‌య‌నం చేయాలి. 4. విద్యావ్య‌వ‌స్థ‌ను విమ‌ర్శించ‌టం వ‌దిలేసి.. పిల్ల‌ల‌కు మంచి అల‌వాట్లు నేర్పించ‌టం చాలా ముఖ్యం. ముందు మ‌న‌లో మార్పు వ‌స్తే.. రేప‌టి పౌరుల్ని మార్చొచ్చు.

-  ఇలాంటి మ‌నుషులు మార‌రు అనే కంటే.. ముందు మీరు.. మీ కులాభిమానాన్ని.. ఆలోచ‌న‌ల్ని.. కుల అహంకార‌న్ని గుర్తించి.. వాటిని క‌రెక్ట్ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఆ త‌ర్వాతే మిగితా వాళ్ల గురించి మాట్లాడండి. మీ గురించి మీరు నిజాయితీగా ఉండండి. ఆ త‌ర్వాత దేశాన్ని బాగు చేసే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టండి. అంతేకానీ.. ఊరికే ఇలాంటి మ‌నుషులు మార‌రంటూ లెక్చ‌ర్లు ఇవ్వొద్దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English