కాంగ్రెస్‌లో చేరికల జోరు...

కాంగ్రెస్‌లో చేరికల జోరు...

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సకల అస్త్రాలు, శస్త్రాలు ప్రయోగించేందుకు సన్నద్ధమవుతోంది. తెలంగాణలో జరుగనున్న ముందస్తు ఎన్నికల వ్యూహ రచన కోసం శుక్రవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నాడు కీలక భేటీ జరుగనుంది.

ఈ భేటీలు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ నాయకులు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఎన్నికల దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలోనే కీలకమైన పొత్తు నిర్ణయాలు... ఏ పార్టీకి ఎన్ని స్ధానాలు కేటాయించాలి వంటి అంశాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.

తెలంగాణ రాష్ట్ర సమితి... ముఖ్యంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఓటమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ పార్టీ తమతో కలిసి వచ్చే వారితో చేయి కలిపేందుకు ప్రాధమికంగా అంగీకారం తెలిపింది. ఈ దిశగా తొలి అడుగులు కూడా పడ్డాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో కలవాలని నిర్ణయించారు.

ఇది తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో కూడా పార్టీకి కలిసి వస్తుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ నాయకులకు వివరించినట్లు చెబుతున్నారు.  

ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కొందరు, సినీ, వ్యాపార రంగాలకు చెందిన కొందరు ముందుకు వస్తున్నారు. శుక్రవారం నాడు ఢిల్లీ తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన భూపతిరెడ్డి శుక్రవారం నాడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.

ఇక సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఆయన కూడా శుక్రవారమే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి బండ్ల గణేష్ కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉంది. ఇక మాజీ పిసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

ఇందుకోసం ఆయన ఢిల్లీ బాట పట్టారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ప్రాధమికంగా సమావేశమైన తర్వాత అధికారికంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వరంగల్‌కు చెందిన నాయకులు కొండా సురేఖ, కొండా మురళీ కూడా తమ అనుచరగణంతో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు