కేసీఆర్‌కు సన్యాసం... కేటీఆర్ అమెరికాకు...!

కేసీఆర్‌కు సన్యాసం... కేటీఆర్ అమెరికాకు...!

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల హ‌డావుడి తారాస్థాయికి చేరుతోంది. సంద‌ర్భం ఏదైనా అధికార ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాయి. వివిద పార్టీల ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఎప్ప‌ట్లాగే విరుచుకుప‌డుతుండ‌గా..తాజాగా వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా నిర్వ‌హించిన పూజ‌లో కూడా అదే ఒర‌వ‌డి కొన‌సాగింది.

గాంధీభ‌వ‌న్‌లో వినాయ‌కుడి ప్ర‌తిష్ట, అనంత‌రం నిర్వ‌హించిన పూజ అనంత‌రం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కొండగట్టు భాదితులకు కాంగ్రెస్ పార్టీ సహాయం చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్ల‌డించారు. కొండగట్టు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఆ ప్రాంతానికి వెళ్తున్నామని చెప్పారు.

మరోవైపు టీచర్లను కేసీఆర్ నాలుగున్నరేళ్లు మోసం చేశారని ఆరోపించిన ఉత్తమ్... రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి... పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుందని... పే రివిజన్ కమిషన్‌ను అమలు చేస్తామని ప్రకటించారు.

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉద్యోగార్థుల‌ను మోసం చేసింద‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. త‌మ‌ ప్రభుత్వం రాగానే మెగా డీఎస్సీవేసి 20 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన పీసీసీ చీఫ్... ప్రభుత్వ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

పదిలక్షల మందికి నిరుద్యోగ భృతి కూడా అందిస్తామని ప్రకటించారు. ఈ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్‌కు ఎలాగూ సన్యాసం తీసుకుంటారు... మంత్రి కేటీఆర్... అమెరికాకు వెళ్లిపోతారని ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. పొత్తులపై టీడీపీ, సీపీఐలతో చర్చించామ‌ని ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి వెల్ల‌డించారు.

తెలంగాణను రక్షించుకునేందుకు కామన్ మినిమం ప్రొగ్రామ్‌తో ముందుకు వెళ్లాలని నిర్ణయించామని... అయితే పొత్తులో సీట్లకు సంబంధించి చర్చ ఇంకా జరగలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్ల‌డించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు