అహం.. కేసీఆర్ .బ్రహ్మస్మీ...

అహం.. కేసీఆర్ .బ్రహ్మస్మీ...

అన్నీ ఆయనే. అంతటా ఆయనే. ప్రభుత్వంలోనే కాదు... పార్టీలో కూడా ఆయనే అన్నీ. ఇది పార్టీలో కొందరికి నచ్చడం లేదు. ప్రభుత్వంలో కొందరికి పొసగడం లేదు.అయినా భరించాల్సిందే. భరిస్తున్నారు కూడా. నాలుగేళ్ల పాలనలో ఆయనే చక్రం తిప్పారు.

ముందస్తు ఎన్పికల ప్రకటన... అభ్యర్ధుల జాబితా ప్రకటనా ఇలా అన్నీ ఆయనే వొంటరిగా చేపట్టడంతో పార్టీలో అందరికి తమ పాత్ర నిమిత్తమాత్రం అని తెలిసిపోయింది. ఇంతకీ ఆయనెవరనుకుంటున్నారా. ఇంకెవరు.... తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. నాలుగేళ్లుగా ప్రభుత్వంలో అన్నీ తానే అయి వ్యవహరించిన కల్వకుంట్ల వారు ఈ ఎన్నికల అంకాన్ని  కూడా తనపైనే వేసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా... ? వద్దా అన్న నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర సమితిలో కొందరితో చర్చించిన కె.చంద్రశేఖర రావు వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు కాని వాటికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని అంటున్నారు. పార్టీ సీనియర్ నాయకులు, మంత్రివర్గంలోని సీనియర్ మంత్రులతో మంతనాలు జరిపినా వారి సలహాలు, సూచనలు మాత్రం పాటించలేదని తెలుస్తోంది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయని పార్టీలో ప్రచారం జరుగుతోంది.

ముందస్తు ప్రకటన చేస్తారని పార్టీలో కొందరు సీనియర్లకు తెలిసినా ఏకంగా 105 మంది అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తారని మాత్రం ఏ ఒక్కరికి తెలియదని అంటున్నారు. సీనియర్ మంత్రులు ఈటల రాజేందర్, తన్నీరు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు వంటి వారితో పాటు తనయుడు, మంత్రి కె.తారక రామారావుకు కూడా అభ్యర్ధుల విషయం తెలియదని అంటున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు కె.కేశవ రావుకు ముందస్తు గురించి సమాచారం ఇచ్చారట కాని, అభ్యర్ధుల గురించి మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అంటున్నారు. దీనికి కారణం సీనియర్లు అభ్యర్ధుల జాబితాలో మార్పులు, చేర్పులు చెబుతారని, వాటిని పాటించకపోతే నొచ్చుకుంటారని భావించే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఎవ్వరికి ప్రాధాన్యత ఇవ్వలేదని అంటున్నారు.

అలాగే తన నిర్ణయమే కనుక అభ్యర్ధులు ఏ ఒక్కరూ తోక జాడించే అవకాశం ఉండదని, తాను చెప్పినట్లుగా పార్టీ నడుచుకుంటుందన్నది కె.చంద్రశేఖర రావు వ్యూహం. సీనియర్లలో కొందరి మాట విని మరికొందరిని పట్టించుకోకపోతే ఇబ్బందులు వస్తాయని కూడా భావించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్నీ తానే అయి వ్యవహరించారని అంటున్నారు. భవిష్యత్‌లో కూడా సీనియర్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా...వారిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారని అంటున్నారు. ఇదంతా కల్వకుంట్ల వారి రాజకీయ ఎత్తుగడలో భాగమే అని పార్టీలో కొందరంటున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English