అలకల తెరాస

అలకల తెరాస

ముందస్తు ఖాయమైంది. టిక్కట్ల పంపిణీ కూడా దాదాపు పూర్తి అయ్యింది. అభ్యర్దులను ప్రకటించాల్సిన స్ధానాలు కూడా తక్కువే. ఇంతవరకూ తెలంగాణ రాష్ట్ర సమితి అంతా సవ్యంగానే ఉంది. అయితే ఇక మిగిలింది అలకలను తీర్చడమే. టిక్కట్లు ప్రకటించిన వెంటనే తెలంగాణ రాష్ట్ర సమితిలో అలకల పర్వం జోరందుకుంది.

ఈ సారి నలుగురైదురు సిట్టింగులకు టిక్కట్లు దొరకవని, వారంతా అలగాల్సిన అవసరం లేదని, వారిని కడుపులో పెట్టుకు చూసుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమతి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించినా.... అలకలు మాత్రం ఆగడం లేదు.

ముందుగా నగర మేయర్ బొంతు రామ్మోహన్ నగరంలోని ఉప్పల్ స్ధానం నుంచి పోటీ చేయాలనుకున్నారు. ఆయనకు నిరాశే ఎదురైంది. గత ఎన్నికల్లోనే టిక్కట్ ఆశించినా అప్పుడూ టిక్కట్ రాలేదు. దీంతో ఆయనను మేయర్ చేసారు కె.చంద్రశేఖర రావు. పార్టీతోనే కాకుండా కల్వకుంట్ల వారి కుటుంబంతో కూడా రామ్మోహన్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చివరకు ఇటీవల జరిగిన ప్రగతి నివేదన సభ పనులు యావత్తూ ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. ఇవన్నీ ద్రష్టిలో ఉంచుకుని తనకు టిక్కట్ ఖాయమని ఆయన ఆశించారు. అయితే అది అడియాశే అయ్యింది. ఆయన బుజ్జగించే పనిలో పడ్డారు మంత్రి తారక రామారావు.

రంగారెడ్డి జిల్లాకు చెందిన నాయకులు కూడా తమకు టిక్కట్ రాలేదని నిరాశగా ఉన్నారు. ముఖ్యంగా కొండగల్ టిక్కట్ ను మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఆశించారు. అయితే ఆ టిక్కట్‌ను ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డికి ఇచ్చారు. దీంతో గురునాథ్ రెడ్డి తన సహచరులతో కలిసి మంతనాలు సాగిస్తున్నారు.

చెవేళ్ల నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే కే.ఎస్.రత్నం కూడా టిక్కట్ ఆశించి భంగపడ్డారు. ఆయనకు కాకుండా ఆ టిక్కట్‌ను కారె యాదయ్యకు ప్రకటించారు. ఈయన కూడా తన భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకునే పనిలో పడ్డారు. ప్రగతి నివేదన సభ జరిగిన కొంగన్ కలాన్‌లో దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసిన కంచర్ల చంద్రశేఖర రెడ్డి అసంత్రప్తిగా ఉన్నారు. ఈ సభ జరిగిన ఇబ్రహింపట్నం నుంచి ఆయన టిక్కట్ ఆశించారు.

అయితే ఆయనకు కాదని సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్ది కిషన్ రెడ్డికి టిక్కట‌్ ఖరారైంది. ఇక్కడ కూడా అసంత్రప్తి పెల్లుబికింది. ఇక మిగిలిన జిల్లాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. చాలా మంది అసంత్రప్తిగా ఉండడంతో వారిని బుజ్జగించే పనిని మంత్రి, తన కుమారుడు కె.తారక రామారావుకు అప్పగించారు తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు. ఈ అలకలు దేనికి దారి తీస్తాయో తేలాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు