ఈ లెక్క‌న మోడీని కూడా కేసీఆర్ మాయ చేసిన‌ట్లే

ఈ లెక్క‌న మోడీని కూడా కేసీఆర్ మాయ చేసిన‌ట్లే

తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడ్డామన్న ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిపక్షాలు విచ్చలవిడి ఆరోపణలు చేస్తున్నాయని, ఇలాంటి ఆరోపణలతో తెలంగాణ అభివృద్ధి ఆగుతుందని, అధికారులను ఇబ్బందుల్లో పడేస్తాయని చెప్పారు.

రాష్ట్ర ప్రగతిచక్రం ఆగొద్దని, అభివృద్ధి, ఆర్థిక పెరుగుదల ఆగకూడదనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టంచేశారు. గురువారం అసెంబ్లీ రద్దుచేస్తూ మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని గవర్నర్‌కు అందజేసిన అనంతరం తెలంగాణభవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీ రద్దుకు నిర్ణయం తీసుకోవటానికి దారితీసిన పరిస్థితులను వివరించారు.

అయితే, ఆయ‌న అక్క‌డితోనే ఆగిపోలేదు. ఎన్నిక‌ల తేదీల‌ను సైతం ప్ర‌క‌టించేశారు. ఆ ప్ర‌క‌ట‌నే కేసీఆర్ ఢిల్లీలో బీజేపీతో ఏ విధంగా దోస్తీ చేస్తున్నారో...ఏకంగా ఈసీని కూడా ప్ర‌భావితం చేసే స్థాయికి చేరిపోయార‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోందంటున్నారు.

కేసీఆర్ విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో అక్టోబర్‌లో ఎన్నికల షెడ్యూల్‌, నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తుందని, నవంబర్‌లో ఎన్నికలు, డిసెంబర్‌ మొదటివారంలో ఫలితాలు కూడా వచ్చేస్తాయని సీఈసీ కంటే ముందే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించేశారు.

దానితోపాటే మధ్యప్రదేశ్‌లో పోలింగ్‌ రెండు విడతల్లో జరుగుతుందని, మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఒకేవిడతలో పోలింగ్‌ ఉంటుందని, తెలంగాణలో కూడా ఒకే విడతలో ఎన్నికలు పూర్తవుతాయని చెప్పేశారు. అసెంబ్లీ ర‌ద్దు జ‌రిగిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే..కేసీఆర్ ఇంత ఘంటాప‌థంగా నోటిఫికేష‌న్ నుంచి మొద‌లుకొని ఫ‌లితాల విడుద‌ల వ‌ర‌కు ప్ర‌క‌టించ‌డం వెనుక‌...ఆయ‌న ఢిల్లీ పెద్ద‌ల‌తో క‌లిగి ఉన్న దోస్తీయే కార‌ణ‌మ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. ఇందుకు ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లు, తాజాగా చేసిన ప్ర‌క‌ట‌న‌లే కార‌ణ‌మంటున్నారు.

గడచిన ఆరునెలల్లో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ నాలుగుసార్లు ఢిల్లీ వెళ్లారు. ఎక్కడా 'ముందస్తు' ప్రణాళిక లీక్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఆర్ధికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీలతో పాటు పలువురు కేంద్రమంత్రులతో స‌మావేశం అయిన కేసీఆర్ 'విభజన హామీల అమలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా వంటి డిమాండ్ల సాధన కోసమే వెళ్లినట్టు చెప్పుకొచ్చారు.

అయితే ఇక్క‌డే అస‌లు కిటుకు ఉందంటున్నారు. రాష్ర్టానికి సంబంధించిన డిమాండ్లతో నామ్‌కే వాస్తేగా కేంద్రమంత్రులకు ఓ మెమోరాండం ఇచ్చి, 'ముందస్తు' హామీ కోసం ఆయన చర్చలు జరిపినట్టు ఇప్పుడు తెలుస్తోంది. అదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ముఖ్య ప్రధానాధికారితో పాటు మిగిలిన ఇద్దరు కమిషనర్లను తాను స్వయంగా కలిసి చర్చలు జరిపినట్టు కేసీఆర్‌ గురువారం తెలంగాణ భవన్‌లో ప్రకటించడం దీనికి ఊతం ఇస్తోంది.

'మీకు తెల్వదు కానీ..చాన్నాళ్ల నుంచే కేంద్ర ఎన్నికల సంఘంతో టచ్‌లో ఉన్నా. అంత ఆషామాషీగా చేయ‌రు క‌దా?' అని జర్నలిస్టులను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు. తాజాగా కేసీఆర్ షెడ్యూల్‌తో స‌హా వెలువ‌రించిన తీరు చూస్తే..మోడీని కూడా మాయ చేసేశాడ‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని ప‌లువ‌రు వ్యాఖ్యానిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English