ఒకే ఒలంపిక్స్ లో రెండు పతకాలు సాధించిన అవనీ..!

టోక్యో పారా ఒలంపిక్స్ లో.. భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. పతకాల జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. భారత మహిళా షూటర్ అవనీ లేఖరా మరోసారి అదరగొట్టారు.

ఇటీవల స్వర్ణ పతకం సాధించిన అవని.. తాజాగా జరిగిన మహిళ 50 మీటర్ల రైఫిల్ 3పీ ఎస్‌హెచ్1 ఫైనల్లో మెరుగైన ప్రదర్శన చేశారు. 445.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన అవని లేఖరా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.

ఈ సోమవారం షూటింగ్ విభాగంలో అవని లేఖరా బంగారు పతకం సాధించడం తెలిసిందే. అయితే, పారాలింపిక్స్‌లో ఓ భారత మహిళ బంగారు పతకం సాధించడం ఇదే తొలిసారి. సోమవారం తెల్లవారు జామున జరిగిన మ్యాచ్‌లో అవని లేఖరా బంగారు పతకం గెలిచి పారాలింపిక్స్‌లో పసిడి నెగ్గిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొల్పారు.

తాజాగా 50 మీటర్ల విభాగంలో కాంస్యం నెగ్గడం ద్వారా ఈ పారాలింపిక్స్ ద్వారా జైపూర్‌కు చెందిన అవని లేఖరా రెండు రికార్డులు తన పేరిట లిఖించుకున్నారు. ఇలా ఒకే ఒలంపిక్స్ లో.. రెండు పతకాలను సాధించి.. అరుదైన ఘనతను అవనీ సాధించారు. దీంతో.. ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.