స్వ‌లింగ సంప‌ర్కంపై సుప్రీం షాకింగ్ తీర్పు!

స్వ‌లింగ సంప‌ర్కంపై సుప్రీం షాకింగ్ తీర్పు!

స్వ‌లింగ సంప‌ర్కం నేర‌మ‌ని పేర్కొనే సెక్షన్ 377పై కొంత‌కాలంగా వాడీ వేడీ చ‌ర్చ జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. సెక్షన్‌ 377 ప్రకారం.. అసహజ శృంగార చర్యలకు పాల్పడినవారికి పదేళ్ల వరకూ జైలుశిక్ష, లేదా జీవితఖైదు విధించ‌చ్చు. అయితే, ఆ సెక్ష‌న్ వ‌ల్ల వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌కు భంగం క‌లుగుతోందంటూ నాజ్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ 2001లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

దీంతో, ఆ సెక్ష‌న్ ను ర‌ద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు 2009లో తీర్పునిచ్చింది. ఆ త‌ర్వాత 2013లో ఈ తీర్పును సుప్రీం కోర్టు రద్దుచేసి.. సెక్ష‌న్ 377ను య‌థావిధిగా అమ‌లు చేసింది. అయితే, సెక్షన్‌ 377 చట్టబద్ధతను సవాల్ చేస్తూ కొంత‌మంది మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జులై 17న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ క్ర‌మంలోనే తాజాగా, స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు నేడు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది.

స్వ‌లింగ సంప‌ర్కం నేరం కాదంలూ 5గురు సభ్యుల ధర్మాసనం 4-1 మెజార్టీతో ఈ తీర్పును వెలువరించింది. సెక్షన్ 377 పరిధిలోకి స్వలింగ సంపర్కం రాదని సుప్రీం స్పష్టం చేసింది. పౌరుల‌ వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరముందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అందరితో పాటు లెస్బియన్లు, గేలకు సమాన హక్కులుంటాయని, సెక్షన్ 377 ఏకపక్షంగా ఉందని సుప్రీం అభిప్రాయపడింది. వ్యక్తిగతంగా తమకు న‌చ్చిన‌ భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ అందరికీ ఉంటుందని తెలిపింది. భావవ్యక్తీకరణను నిరాకరించడం....మరణంతో సమానమని వ్యాఖ్యానించింది.

పరస్పర అంగీకారంతో జరగే స్వలింగ సంపర్కం నేరం కాదని తుది తీర్పును వెలువరించింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా భావించడం అహేతుకం అని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. ఎల్‌జీబీటీ వర్గానికి చెందిన వ్యక్తులకు కూడా సాధారణ పౌరులకు ఉండే హక్కులే ఉంటాయని, వారి వ్యక్తిత్వాన్ని మనం గౌరవించాలని పేర్కొంది. సెక్షన్‌ 377 సమానత్వ హక్కులను ఉల్లంఘిస్తోందని అని తీర్పు సందర్భంగా జస్టిస్‌ దీపక్‌ మిశ్ర అన్నారు. అయితే,  జంతువులతో లైంగిక చర్యను, చిన్నారులతో అసహజ శృంగారం మాత్రం నేరంగానే పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు, సుప్రీంకోర్టు తీర్పుపై స్వలింగ సంపర్కులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు