సాయంత్రానికి అందరూ మాజీలే

సాయంత్రానికి అందరూ మాజీలే

నాలుగేళ్లు అధికారాన్ని అనుభవించారు. అన్ని లాంచనాలు పొందారు. ప్రజల్లో గౌరవ మర్యాదలూ సరేసరి. ఇంకా సంవత్సరం గడువున్నా.... దానితో సంబంధం లేకుండా అందరూ మాజీలవుతున్నారు. ఇక అధికారం ఉండదు. ఆర్భాటం ఉండదు. హంగూ ఉండదు. పరపతి అసలే పని చేయదు. ఇక అందరూ మాజీలే.

ముఖ్యమంత్రి మాజీ కాకపోయినా... ఆపధర్మ ముఖ్యమంత్రే. మంత్రులూ మాజీలే.... శాసనసభ్యులూ మాజీలే. మధ్యాహ్నం తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంత్రివర్గ సమావేశం నుంచి నేరుగా గవర్నర్ నరసింహన్‌ను కలుస్తారు. మంత్రివర్గ భేటీ తర్వాత ఆ నిర్ణయాలను గవర్నర్‌కు తెలియజేస్తారు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నామంటూ ఏకవాక్య తీర్మానాన్ని మంత్రివర్గం ఆమోదిస్తుంది.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గురువారం ఉదయం  గన్‌పార్క్‌లో అమరవీరుల స్మారక స్ధూపానికి వెళ్లి అక్కడ నివాళులర్పిస్తారు. ఏ పని ప్రారంభించినా గన్‌పార్క్‌కు వెళ్లి అక్కడ అమరవీరులకు నివాళి అర్పించడం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి అలవాటు. ప్రభుత్వ రద్దు నిర్ణయాన్ని కూడా ఇలాగే చేయనున్నారు.

మంత్రివర్గ సమావేశం తర్వాత గవర్నర్ ని కలిసి ప్రభుత్వ రద్దు నిర్ణయం ప్రకటించిన తర్వాత తెలంగాణలో ఏ శాసనసభ్యుడు ఇక అధికారిక ఎమ్మెల్యే కాదు. నిన్నటి వరకూ వంగి వంగి దండాలు పెట్టిన వారెవ్వరూ ఇక మీదట అలా చేయరు. పదవి పోయిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదు. పోలీస్ వ్యవస్ధతో పాటు ప్రభుత్వానికి చెందిన ఏ పని కావాలన్నా ఇక శాసనసభ్యులకు కష్టసాధ్యమే. అయితే,  ఈ పరిస్థితిని ముందే ఊహించారు కాబట్టి పాత తారీఖులతో కొన్ని జీవోలు విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే ఇది కూడా దాదాపు అసాధ్యంగానే ఉంటుంది. ఆపధర్మంగా ఉన్న ప్రభుత్వం ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. అత్యవసర పరిస్థితులలో తప్ప ఆపధర్మ ముఖ్యమంత్రి కేవలం దిష్టిబొమ్మలాంటి వారేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తొమ్మిది నెలల కాలం ఉన్నా తాము బలవంతంగా మాజీలం కావడం కొందరు ఎమ్మెల్యేలకే మింగుడు పడడం లేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల్లో కొందరు ముందస్తుపై తమ అసంత్రప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే వారంతా ఏమీ చేయలేని పరిస్థితిలోనే ఉన్నారు. ఇది బలవంతపు మాజీలే అని వారు వాపోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు