ఆన్ లైన్లో మోడీకే జై!

ఆన్ లైన్లో మోడీకే జై!

మోడీ మీద వ్య‌తిరేక‌త అంత‌కంత‌కూ పెరిగిపోతోందంటూ ఈ మ‌ధ్య‌న జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే.. అందులో నిజం ఎంత‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారుతోంది. ఓవైపు మోడీ పాల‌న‌పై అసంతృప్తి పెరుగుతున్న వైనం వెలువ‌డుతున్న ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎప్ప‌టిక‌ప్పుడు స్ప‌ష్టం చేస్తుంటే.. ఇందుకు భిన్నంగా ఆన్ లైన్లో మోడీ ఇమేజ్ మాత్రం ఎంత‌కూ త‌గ్గ‌టం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

దీనికి త‌గ్గ‌ట్లే తాజాగా నిర్వ‌హించిన ఒక ఆన్ లైన్ అధ్య‌య‌నంలో ఎక్కువ‌మంది మోడీ వైపే మొగ్గు చూప‌టం గ‌మ‌నార్హం. దేశానికి నేతృత్వం వ‌హించ‌టానికి మెరుగైన నేత ఎవ‌రు? అన్న ప్ర‌శ్న‌కు 48 శాతం మంది మోడీ వైపు మొగ్గు చూపితే.. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి కేవ‌లం 11.2 శాతం మంది మాత్ర‌మే మొగ్గుచూపారు.

ఇక‌.. ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ కు 9.3 శాతం.. స‌మాజ్ వాదీ పార్టీ అగ్ర‌నేత మాజీ యూపీ సీఎం అఖిలేశ్ యాద‌వ్ కు 7 శాతం మొగ్గు చూపారు. ఇక‌.. బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి 4.2 శాతం.. బీఎస్పీ చీఫ్ మాయావ‌తికి 3.1 శాతం మంది మ‌ద్ద‌తు తెలిపారు.

ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. ఈ అధ్య‌య‌నాన్ని నిర్వ‌హించింది రాజ‌కీయ పార్టీల‌కు వ్యూహా సేవ‌లు అందించే ప్ర‌శాంత్ కిశోర్ కు చెందిన ఐ-పీఎసీ సంస్థ. నేష‌న‌ల్ అజెండా ఫోరం పేరుతో నిర్వ‌హించిన ఈ అధ్య‌య‌నంలో దేశం ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌లు ఏమిటి?  ఆ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి దేశానికి ఎవ‌రు నేతృత్వం వ‌హించే సామ‌ర్థ్యం ఉన్న నేత ఎవ‌ర‌న్న ప్ర‌శ్న‌కు ఎక్కువ‌మంది మోడీవైపు మొగ్గు చూపారు. ఈ అధ్య‌య‌నంలోదాదాపు 57 ల‌క్ష‌ల మంది పాల్గొన్న‌ట్లు చెబుతున్నారు. నిజ‌మే.. మోడీ స‌మ‌ర్థుడే.. కానీ మంచి పాల‌కుడు కాద‌నేది ప్ర‌జ‌ల మాటేమో?


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు