పొమ్మనలేక పొగబెడుతున్నారు

పొమ్మనలేక పొగబెడుతున్నారు

సీనియర్ నేత, రాజ్యసభసభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ స‌స్పెన్ష‌న్ ఫిర్యాదు, అనంత‌రం ఆయ‌న స్పందించిన ఎపిసోడ్‌ అనూహ్య‌మైన మ‌లుపులు తిరుగుతోంది. పార్టీ వ్య‌తిరేక కార్య‌కలాపాల‌కు పాల్ప‌డుతున్నారంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంపీ, సీఎం కేసీఆర్ త‌న‌య క‌విత స‌హా నిజామాబాద్‌ జిల్లా ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు సోనియాగాంధీ స‌హా ఇతర నేతలను ఢిల్లీలో కలుసుకోవడంతో పాటు, త్వరలో ఆ పార్టీలో చేరబోతారన్న వార్తలు రావ‌డం, డీఎస్ త‌న‌యుడు అర‌వింద్ బీజేపీలో దూకుడుగా ముందుకు వెళ్ల‌డం వంటివి ఇందుకు కార‌ణాల‌ని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ ఫిర్యాదు అనంత‌రం కొద్దికాలానికి ఆయ‌న తనయుడు సంజయ్‌పై లైంగిక వేధింపుల కేసు న‌మోదవ‌డం, అనంత‌రం ఆయ‌న అరెస్ట‌వ‌డం తెలిసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విష‌యంలో తాజాగా డీఎస్ వేసిన స్టెప్ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

``నన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయండి. లేకుంటే నాపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోండి. మీరు మంచి సమన్వయ కర్త, మీలాంటోళ్లు పార్టీకి చాలా అవసరమంటూ వెంటపడి మరీ కేసీఆర్‌ నన్ను టీఆర్ఎస్‌లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు పొమ్మనలేక పొగబెడుతున్నారు. నేను ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీనామా చేయను. సస్పెండ్‌ చేయండి' అని రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్‌ టీఆర్ఎస్‌ అధిష్టానానికి తేల్చిచెప్పారు. దీంతో డీఎస్ ఏం చేయ‌నున్నార‌నే చ‌ర్చ స‌హ‌జంగానే సాగుతోంది. కాగా డీఎస్‌కు సంబంధించి కాంగ్రెస్ వ‌ర్గాలు కీల‌క వార్త‌ను ప్ర‌చారంలో పెట్టాయి. డీఎస్ తిరిగి కాంగ్రెస్‌లో చేర‌నున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈనెల 12న లేదా 13న ముహుర్తం ఖరారైంద‌ని స‌మాచారం. రాహుల్ సమక్షంలో డీఎస్ తిరిగి పార్టీలో చేరనున్నార‌ని స‌ద‌రు వ‌ర్గాల స‌మాచారం. రాహుల్ గాంధీ ప్రస్తుతం మానససరోవర యాత్రలో ఉన్నందున ఈ చేరిక ఆల‌స్యం అవుతున్న‌ట్లు స‌మాచారం. ఈనెల 11వ తేదీ రాత్రి రాహుల్ ఢిల్లీకి చేరుకోనున్నార‌ని, అనంత‌రం ఈ భేటీ ఉంటుంద‌ని అంటున్నారు.

డీఎస్ రాక‌తో కేసీఆర్ టార్గెట్‌గా కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడు పెంచనుంద‌ని తెలుస్తోంది. గులాబీ పార్టీలో కుటుంబ ఆదిప‌త్యం ఎలా సాగుతుందో తెలియ‌జెప్ప‌డం, నాయ‌కుల‌కు స్వేచ్ఛ లేని విష‌యాల‌ను ప్ర‌స్తావించ‌డం, ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌ను చాటిచెప్ప‌డం అంశాలను డీఎస్ రూపంలో చాటిచెప్ప‌నున్న‌ట్లు స‌మాచారం. కాగా, డీఎస్ రాకపై ప‌లువురు పార్టీ నేత‌లు పాజిటివ్‌గా ఉన్న నేప‌థ్యంలో పార్టీ దూకుడుగా వెళ్ల‌డం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English