రిజెక్ట్ చేసిన అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేస్తా: బీజేపీ ఎమ్మెల్యే

రిజెక్ట్ చేసిన అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేస్తా: బీజేపీ ఎమ్మెల్యే

మ‌హారాష్ట్రలోని గ‌టోకోప‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రామ్ క‌దం చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. వివాదాస్ప‌దంగా మారాయి.

ఇంత‌కూ ఆయ‌నేమ‌న్నారంటే.. ప్రేమను వ్య‌క్త‌ప‌ర్చిన అబ్బాయిని అమ్మాయి కానీ రిజెక్ట్ చేస్తే.. అలాంటి అమ్మాయిల్ని కిడ్నాప్ చేసైనా స‌రే.. స‌ద‌రు పిల్లాడికిచ్చి పెళ్లి చేస్తానంటూ చేసిన వ్యాఖ్య‌లు ప‌లువురి ఒళ్లు మండేలా చేస్తున్నాయి. అయితే.. త‌న మాట‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న వారి మాట‌ల్ని అస్స‌లు ప‌ట్టించుకోవ‌టం లేదు స‌ద‌రు బీజేపీ ఎమ్మెల్యే. అంతేనా.. త‌న‌కు ఏ స‌మ‌యంలోనైనా స‌రే ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి స‌ద‌రు కుర్రాడితో పెళ్లి చేయిస్తాన‌న్న భ‌రోసాను ఇస్తూ ఫోన్ నెంబ‌రు ఇవ్వ‌టం సంచ‌ల‌నంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే మాట‌ల‌పై ప‌లువురు తీవ్రంగా మండిప‌డుతున్నారు.

ఇలా మాట్లాడుతున్నాడు.. స‌ద‌రు ఎమ్మెల్యేకు ఏం పోయే కాలం? స‌ంస్కృతి.. చ‌ట్టుబండ‌ల అని నిత్యం చెప్పే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇలా వ్యాఖ్య‌లు చేస్తుంటే.. మిగిలిన వారు ఏమీ స్పందించ‌రా? అంటూ ప‌లువురు తిట్టిపోస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌ల సీరియ‌స్ నెస్ అర్థ‌మైందో ఏమో కానీ.. స‌ద‌రు ఎమ్మెల్యే త‌ల్లి మాత్రం బ‌య‌ట‌కు వ‌చ్చి.. త‌న కొడుకు త‌ప్పుగా మాట్లాడాడ‌ని.. క్ష‌మించాల‌ని వేడుకోవ‌టం గ‌మ‌నార్హం. రాక్ష‌స ప్రేమ‌ల‌కు అండ‌గా ఉండ‌ట‌మే కాదు.. కిడ్నాప్ చేస్తాన‌ని బ‌హిరంగంగా మాట్లాడిన ఎమ్మెల్యేపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న మాట ప‌లువురి నోటి నుంచి వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు